బలరాముడిగా ‘అందరి బంధువు’
భద్రాచలం: అందరి బంధువుగా భక్తులు కీర్తించే అందాల రామయ్య బలరామయ్యగా భక్తులకు కనువిందు చేశాడు. అధ్యయనోత్సవాల్లో ఎనిమిదో రోజైన శనివారం రామయ్యను బలరామావతారంలో అలంకరించారు. శేష తల్పమున సేదదీరి రెండు చేతుల్లో శంకు చక్రాలు, మరో రెండు చేతుల్లో నాగలిని, గదను చేబూని సీతాలక్ష్మణులతో దర్శనమిచ్చిన బలరాముడికి భక్తులు జేజేలు పలికారు. శ్రీహరికి శయన ఆదిశేషుని అంశతో జన్మించి, శ్రీకృష్ణునికి అన్నగా ఆయనకు ధర్మస్థాపనలో సహకరి స్తూ, అపర పరాక్రముడిగా పేరొందిన బలరామ య్య దర్శనమిచ్చాడని అర్చకులు అవతార విశిష్టతను వివరించారు. స్వామివారికి ఆలయంలో తెల్ల వారుజామున ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుప్రభాతం, ఆరాధన సేవలు జరిపారు. స్వామి వారిని బలరామావతారంలో అలంకరించిన బేడా మండపంలో భక్తుల దర్శనార్థం కొద్దిసేపు ఉంచారు.
ఘనంగా శోభాయాత్ర
పగల్‌పత్తు ఉత్సవాల్లో భాగంగా జరిగిన బలరామావతారాన్ని శనివారం లారీ అసోసియేషన్ సహాయ సహకారాలతో వైభవోపేతంగా జరిపారు. సంఘబాధ్యులు, ఆలయ అధికారులు స్వామివారిని పల్ల కీపై ఊరేగింపుగా మహిళల కోలాటాలు, బాజాభజంత్రీలు, మంగళవాయిద్యాల నడుమ మిథిలా స్టేడియం వద్దకు శోభాయాత్రగా తీసుకొచ్చారు. ప్రత్యేకంగా అలంకరించిన వేదిక వద్ద స్వామివారిని కొలువుదీర్చి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు స్వామివారికి హారతిని సమర్పించారు. భక్తులకు స్వామివారి ఆశీర్వచనాలను అందచేసి నైవేద్యాన్ని ప్రసాదంగా అందజేశారు. తిరువీధి సేవను ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేదపండితులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
కేరింతలతో ఫ్లాష్ మాబ్
యువతీ యువకుల కేరింతలు, ఆటపాటల ఫ్లాష్ మాబ్, శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానం అర్చకులు సమర్పించిన నదీ హారతిలతో గోదావరి తల్లి పులకించింది. ముక్కోటి ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలలో భాగంగా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ప్రత్యేక కార్యక్రమాలను రూపకల్పన చేశారు. భద్రాచలంలోని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతో స్నానఘాట్ల మెట్ల వద్ద శని వారం ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. రఘుకుల తిలక రారా.., సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా తదితర గీతాలకు విద్యార్థులు నృత్యప్రదర్శనలు చేశారు. గోదావరి మాతకు రామాలయ అర్చకులు, పండితులు నదీ హారతి సమర్పించారు. కలెక్టర్ జితేష్ వి.పాటిల్ హాజరై నృత్యం చేసి యువతను ఉత్సాహపరిచారు. ఈఓ దామోదర్ రావు, ఈఈ రవీందర్, ఇతర అధికారులు ధనియాల వెంకటేశ్వర్లు, వెంకటేశ్వర్, వెంకటేశ్వర్లు, సర్పంచ్ పూనెం కృష్ణ పాల్గొన్నారు.
లారీ అసోసియేషన్ సహకారంతో శోభాయాత్ర
బలరాముడిగా ‘అందరి బంధువు’


