స్వీయ జాగ్రత్తలతోనే రక్షణ
● చలికాలంలో వృద్ధులు, పిల్లలపై అప్రమత్తంగా ఉండాలి ● సాక్షి ‘ఫోన్‌ఇన్’లో డీఎంహెచ్‌ఓ డాక్టర్ తుకారామ్ రాథోడ్
చుంచుపల్లి: జిల్లాలో ఇటీవల చలి తీవ్రత ఎక్కువైనందున పిల్లలు, పెద్దలకు స్వీయ జాగ్రత్తలే శ్రీరామ రక్షగా నిలుస్తాయని జిల్లా వైద్యాధికారి డాక్టర్ తుకారామ్ రాథోడ్ సూచించారు. సాక్షి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ‘ఫోన్ ఇన్’కార్యక్రమంలో జిల్లా ప్రజలు శీతాకాలంలో ఎదుర్కొంటున్న సమస్యలు, సందేహాలను నివృత్తి చేశారు.
ప్రశ్న: చలికాలంలో ప్రధానంగా వచ్చే వ్యాధులు ఏమిటీ..? ఎన్.సారయ్య, కొత్తగూడెం
డీఎంహెచ్‌ఓ: శీతాకాలంలో గొంతునొప్పి, చలి జ్వరం, ఆస్తమా, బ్రాంకై టీస్, నిమోనియా, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.
ప్రశ్న: ఆరోగ్యం పట్ల ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవాలి? రమాదేవి, కొత్తగూడెం
డీఎంహెచ్‌ఓ: చర్మం పొడిబారకుండా మాయిశ్చరైజర్స్ రాసుకోవాలి. చల్లగాలిలో తిరగొద్దు. దుమ్ము, ధూళికి దూరంగా ఉండాలి. రోజూ 6 నుంచి 8 గ్లాసుల నీరు తాగాలి. వెచ్చటి దుస్తులు ధరించాలి. తల, చెవి భాగాలు మఫ్లర్‌తో కప్పి ఉంచాలి.
ప్రశ్న: గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? బి.నారాయణ, చాతకొండ
డీఎంహెచ్‌ఓ: ఉబ్బసం, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు చలికాలంలో ప్రయాణం చేస్తే బీపీ పెరిగి రక్తనాళాలు ముడుచుకు పోయి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది.
ప్రశ్న: చలికాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎస్.వెంకటేశ్వరరావు, రేగళ్ల
డీఎంహెచ్‌ఓ: చలికాలంలో కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్, ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి. నువ్వులతో చేసిన ఆహార పదార్థాలు, మాంసాహారం ఎక్కువగా తీసుకోవాలి. ఆలుగడ్డ, బీట్రూట్, క్యారెట్, మష్రూమ్స్ వంటి దుంప కూరలు, యాపిల్, అరటిపండ్లు, బొప్పాయి వంటివి తీసుకోవచ్చు.
ప్రశ్న: మందులు అందుబాటులో ఉన్నాయా? జి.రాజేష్, సుజాతనగర్
డీఎంహెచ్‌ఓ: చలికాలం నేపథ్యంలో వచ్చే జలుబు, దగ్గు, ఆస్తమా, జ్వరం వంటి సమస్యలకు అన్ని పీహెచ్‌సీల్లో మందులు, సిరప్‌లు అందుబాటులో ఉంచాం.
ప్రశ్న: సుజాతనగర్ పీహెచ్‌సీలో సిబ్బంది అందుబాటులో ఉండటం లేదు? జయరాంరెడ్డి, వేపలగడ్డ
డీఎంహెచ్‌ఓ: సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటాం.
ప్రశ్న: చలి కాలంలో వృద్ధులు ఎదుర్కొనే సమస్యలు ఏమిటీ.?: జి.సంతోష్, ప్రశాంతి నగర్
డీఎంహెచ్‌ఓ:చలికాలంలో వృద్ధుల్లో పొడి దగ్గు, పిల్లి కూతలు, ఛాతీలో బరువు వంటి లక్షణాలు కనిపిస్తే ఆస్తమాగా భావించాలి. ఆస్తమా మందులు వాడేవారు ఇన్హేలర్లు వినియోగించాలి.
స్వీయ జాగ్రత్తలతోనే రక్షణ


