పీఏసీఎస్‌లో ‘నామినేటెడ్’!
బేతంపూడి సొసైటీలో 9వేల మంది సభ్యులు
● త్రీమెన్ కమిటీలతో నాన్ అఫీషియల్ సొసైటీల ఏర్పాటుకు కసరత్తు ● ఈ నెల 19న సహకార సంఘాల పాలకవర్గాలు రద్దు
టేకులపల్లి: రైతుల సంక్షేమం, ఆర్థికాభివృద్ది కోసం పని చేస్తున్న సహకార సంఘాలను రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19న రద్దు చేసింది. దీంతో పాలన పర్సన్ ఇన్‌చార్జ్‌ల చేతుల్లోకి వెళ్లింది. ఇప్పటికే పర్సన్ ఇన్‌చార్జ్‌లు ఆయా సొసైటీలకు వెళ్లి చార్జ్ కూడా తీసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 21, ఖమ్మం జిల్లాలో 79 సొసైటీలు ఉన్నాయి. ఇక నుంచి ఎన్నికల ద్వారా కాకుండా పాలక మండలిని నామినేటేడ్ నియామకాల ద్వారా ఎన్నుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. సంక్రాంతి తర్వాత నామినేటెడ్ పాలకవర్గాలు కొలువుదీరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏపీ తరహాలో ఒక చైర్మన్, ఇద్దరు సభ్యులతో నాన్ అఫీషియల్ పీఏసీఎస్‌లను ఏర్పాటు చేసే యోచనతోపాటు, ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే నియామకాలు జరిగేలా చర్యలు చేపడుతున్నారు. సహకార శాఖ చట్టంలో మార్పులేమీ చేయకుండానే ఉన్న నిబంధనలకు అనుగుణంగానే నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
భారీగా టర్నోవర్
బేతంపూడి సొసైటీ అందరి సహకారంతో కోట్ల రూపాయల టర్నోవర్‌తో ముందుకు దూసుకుపోతోంది. రుణాల ద్వారా రూ.25 కోట్లు, పురుగు మందుల విక్రయాల ద్వారా రూ.80 లక్షలు, ఎరువుల విక్రయాల ద్వారా రూ.3 కోట్లు, విత్తనాల విక్రయాల ద్వారా రూ.30 లక్షలు, ధాన్యం కొనుగోలు ద్వారా రూ.20 కోట్ల టర్నోవర్ సాధిస్తోంది. సొసైటీకి గోడౌన్, పెట్రోల్‌బంక్, ఫార్మసీ మంజూరయి. వీటి ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సీఎస్‌సీ సెంటర్ కూడా సొసైటీలో కొనసాగుతోంది.
నామినేటెడ్‌పై అప్పుడే చర్చలు!
నామినేటేడ్ పాలకవర్గ వ్యవహారంపై అధికార పార్టీ వర్గాల్లో ఇప్పటికే చర్చలు, సంప్రదింపులు మొదలయ్యాయి. 2013లో జరిగిన ఎన్నికల్లో బేతంపూడి సొసైటీకి లక్కినేని సురేందర్‌రావు చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఒకటిన్నర సంవత్సరం పాలన అనంతరం జెడ్పీటీసీగా గెలుపొందారు. దీంతో వాంకుడోత్ పూన్యాకు ఇన్‌చార్జ్ ఇచ్చారు. ఆరు నెలల తరువాత దళపతి శ్రీనివాస్ రాజును చైర్మన్‌గా ఎన్నుకున్నారు. ఆ తర్వాత ఒకటిన్నర సంవత్సరాలకు దళపతిని తొలగించి పూన్యాకు ఇన్‌చార్జ్ ఇచ్చారు. 2018లో ఎన్నికలు జరగాల్సి ఉండగా ఆరు నెలలకు ఒకసారి వాయిదా వేసుకుంటూ రెండు సంవత్సరాలు కొనసాగించి 2020లో ఎన్నికలు నిర్వహించగా మళ్లీ లక్కినేని చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఫిబ్రవరి 14, 2025తో పాలన ముగిసినప్పటికీ ఆరు నెలలు చొప్పున వాయిదా వేస్తూ వచ్చారు. ఈ నెల 19న పాలకవర్గాలు రద్దు కాగా, నామినేటెడ్ పోస్టులు ఎవరు దక్కించుకుంటారోననే చర్చ సాగుతోంది.
సుమారు 9 వేల మంది సభ్యులతో బేతంపూడి సొసైటీ అభివృద్ధి పథంలో కొనసాగుతోంది. రైతుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో పరిపాలన ఇబ్బందిగా మారింది. జిల్లాలో ఇప్పటికే ఆళ్లపల్లి, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, సుజాతనగర్, అన్నపురెడ్డిపల్లి, దుమ్ముగూడెం, పాల్వంచ, బూర్గంపాడు మొత్తం 8 కొత్త సొసైటీలు మంజూరయ్యాయి. టేకులపల్లి మండలంలోనూ నూతన సొసైటీ ఏర్పాటు ఆవశ్యకత ఉంది. 2005కు ముందు మండలంలో బొమ్మనపల్లి, బేతంపూడి రెండు సొసైటీలు ఉండేవి. 2005 తర్వాత బొమ్మనపల్లిని బేతంపూడిలో విలీనం చేశారు. రైతులకు ప్రభుత్వ పథకాలు, సంక్షేమం, అభివృద్ది ఫలాలు చేరువ కావాలంటే టేకులపల్లి మండలంలో బొమ్మనపల్లి, బోడు, కోయగూడెం సహకార సంఘాలు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతతున్నారు. కాగా బేతంపూడి సొసైటీకి పర్సన్ ఇన్‌చార్జ్‌గా సీనియర్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ కె.ఆదినారాయణ నియమితులయ్యారు.


