నేడు, రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
మధిర: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శని, ఆదివారం జిల్లాలో పర్యటించనున్నారు. శనివారం సాయంత్రం నేలకొండపల్లి మండలంలోని అనంతనగర్, ఖమ్మం రూరల్ మండలంలోని కామంచికల్‌లో విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణానికి రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేస్తారు. అలాగే, ఆదివారం ఉదయం 11 గంటలకు మధిరలో జరిగే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భట్టి పాల్గొంటారు. అనంతరం మధిర మున్సిపల్ నూతన కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
30నుంచి రెండు రాష్ట్రాల స్థాయి కబడ్డీ పోటీలు
నేలకొండపల్లి: నేలకొండపల్లి మండలం చెరువుమాధారంలో ఈనెల 30వ తేదీ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు కమిటీ బాధ్యులు తెలిపారు. ఈమేరకు శుక్రవారం నిర్వాహకుడు సూరేపల్లి శ్రీను మాట్లాడుతూ నూతన సంవత్సరం సందర్భంగా ఏటా మాదిరిగానే కబడ్డీ పోటీలు ఏర్పాటుచేశామని చెప్పారు. అలాగే, ముగ్గులు, ట్రాక్టర్స్ రివర్స్ పోటీలు ఉంటాయని, ఆసక్తి ఉన్న వారు పాల్గొనాలని కోరారు.
కారు, ఇసుక టిప్పర్ ఢీ..
● తప్పిన పెనుప్రమాదం..
దుమ్ముగూడెం: వరుస సెలవులతో పాటు ముక్కోటి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యాన పర్ణశాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నాయి. ఈక్రమంలో శుక్రవారం భద్రాచలం –వెంకటాపురం రోడ్డులో బుర్రవేములా దగ్గర ముందున్న కారును వెనక వస్తున్న ఇసుక టిప్పర్ ఢీకొట్టి సుమారు 20 అడుగుల మేర లాక్కొనివెళ్లింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. అయితే మండల ప్రధాన రహదారి మీదుగా అధికారులు ఇసుక రవాణా నిలువరించలేరని తేటతెల్లం అవుతోంది. కనీసం భద్రాచలం, పర్ణశాలలో జరిగే ప్రత్యేక కార్యక్రమాల సమయంలోనైనా ఇసుక లారీల రవాణా నిలిపివేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని మండలవాసులు కోరుతున్నారు.
వివాహిత అదృశ్యం
ములకలపల్లి: వివాహిత మహిళ అదృశ్యంపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎస్సై మధుప్రసాద్ కథనం మేరకు.. మండలంలోని మొగరాలగుప్ప గ్రామానికి చెందిన కుర్పం జయలక్ష్మి, భర్త కన్నయ్యతో కలసి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈక్రమాన బుధవారం ఇంటి నుంచి వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాకపోవడంతో బంధువులు, సమీపస్తులను విచారించినా ఆచూకీ తెలియరాలేదు. దీంతో ఆమె భర్త శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
పాండురంగాపురంలో యువతి..
పాల్వంచరూరల్: ఇంట్లోనుంచి తెల్లవారుజామున బయటకు వెళ్లిన యువతి అదృశ్యమైన ఘటనపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు కథనం ప్రకారం.. మండల పరిధి పాండురంగాపురం ఉమ్మడి పంచాయతీకి చెందిన డిగ్రీ చేసి ఇంటి వద్ద ఉంటున్న 24 ఏళ్ల యువతి శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆమె కుటుంబీకులు ఎక్కడా వెతికిన ఆచూకీ లభ్యం కాకపోవడంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సురేశ్ తెలిపారు.
ఇసుక లారీ పట్టివేత
బూర్గంపాడు: ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న లారీని శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. మండల పరిధిలోని బుడ్డగూడెం గ్రామం వద్ద కిన్నెరసాని నుంచి ఇసుకను తరలిస్తుండగా.. మోరంపల్లిబంజర వద్ద పోలీసులు పట్టుకుని లారీని సీజ్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బాధ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మేడా ప్రసాద్ తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి
తల్లాడ: తల్లాడ మండలం అంజనాపురానికి చెందిన ఓ యువకుడు శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అంజనాపురం గ్రామంలో నాయనమ్మ ఇంట్లో మూడ్ పవన్(23) జీవిస్తున్నాడు. గురువారం రాత్రి ఆయన ఇంటి ఎదుట కొందరు కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీ కడుతుండగా పవన్ అడ్డుచెప్పాడు. దీంతో ముగ్గురు ఆయనపై దాడి చేస్తుండగా స్థానికుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది. అయితే, శుక్రవారం ఉదయంకల్లా ఆయన ఇంట్లో కూర్చున్న స్థితిలో చీరతో ఉరి వేసుకుని కనిపించాడు. ఈ విషయాన్ని బంధువులు గుర్తించగా ఆయన పెదనాన్న కొడుకు రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఎన్.వెంకటకృష్ణ తెలిపారు.
నేడు, రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన


