గోదావరిలో విషాదం..
● చేపల వేటకు వెళ్లిన గజ ఈతగాడు మృతి ● ఉరితాడైన మెడలోని దుప్పటి?
అశ్వాపురం: అర్ధరాత్రి చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు గోదావరీలో మునిగి మృత్యువాత పడ్డాడు. మండల పరిధిలోని చింతిర్యాల గ్రామానికి చెందిన నాగుల వెంకటరమణ(48) శుక్రవారం తెల్ల వారుజామున తన సహచరులతో కలిసి చేపలవేటకు వెళ్లారు. ఒక పట్టు చేపలు ఒడ్డుకు చేర్చి రెందో పట్టుకు పడవలో గోదావరిలో వెళ్తుండగా.. ఇంజన్ స్టార్ట్ చేస్తున్న క్రమంలో ప్రమాదశాత్తు ఇంజన్ చక్రంలో తన మెడపై ఉన్న దుప్పటి పడి లాగేయడంతో దుప్పటి మెడకు బలంగా బిగుసుకొని గోదావరిలో పడి గల్లంతయ్యాడు. వెంకటరమణ చేపల వేట, గోదావరిలో ఈతలో అనుభవజ్ఞుడు కావడంతో ఈదుకుంటూ వస్తాడులే అని సహచరులు ఎదురుచూశారు. కానీ ఎంతకీ రాకపోవడంతో గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టారు. సీఐ అశోక్‌రెడ్డి, సిబ్బంది పర్యవేక్షణలో తొమ్మిది గంటల పాటు గాలించగా.. వెంకటరమణ మృతదేహం లభ్యమైంది. మెడలో దుప్పటి ఆయన మెడకు బిగియడంతో ఉరిలా పడి అందులో పడి మృతి చెంది ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు.
అనుభవం ఉన్నా..
ప్రాణంతో గోదావరిలో పడితే ఎంత లోతు నుంచైనా ఈదుకుంటూ బయటకు రాగల సమర్థుడు.. చేపల వేటలో అనుభవజ్ఞుడు.. అయినా అనుకోని ప్రమాదంలో వెంకటరమణ గోదావరిలోనే మృతి చెందాడు. కాగా, గోదావరి వరదల సమయాన మండలంలో గోదావరి పరీవాహక ప్రాంతాల్లో పడవల సాయంతో స్థానికులను పునరావాస కేంద్రాలకు తరలింపులో ఆయన కీలక పాత్ర పోషించాడు. కాగా, వెంటకరమణకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సీఐ అశోక్‌రెడ్డి ఆధ్వర్యాన మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


