దేవాదాయ చట్టాల సవరణ అనివార్యం
ఖమ్మంగాంధీచౌక్: సమస్యలు పరిష్కారం కావాలంటే దేవాదాయ, ధర్మాదాయ శాఖ చట్టాలను సవరించడం తప్పనిసరని అర్చక, ఉద్యోగ సంఘాల రాష్ట్ర జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రర్మ పేర్కొన్నారు. ఖమ్మం పవనసుత జలాంజనేయ స్వామి దేవస్థానంలో అర్చక, ఉద్యోగ సంఘాల జిల్లా అధ్యక్షులు దాములూరి వీరభద్రరావు, తోటకూర వెంకటేశ్వర్లు అధ్యక్షతన శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఏర్పడ్డాక పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలను సవరించినా దేవాదాయ శాఖ చట్టాన్ని విస్మరించారని ఆరోపించారు. ఫలితంగా పదేళ్లకు పైగా పనిచేస్తున్న అర్చక, ఉద్యోగుల రెగ్యులరైజేషన్, కాంట్రాక్టు, కన్సాలిడేటెడ్, ఔట్ సోర్సింగ్ అర్చక, ఉద్యోగుల క్రమబద్ధీకరణలో జాప్యం జరుగుతోందని తెలిపారు. జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డీవీఆర్.శర్మ మాట్లాడుతూ అసమానతలు తొలగించి అర్చక, ఉద్యోగులందరికీ ఒకే వేతన విధానం, డీడీఎన్ అర్చకులకు 1999 పీఆర్‌సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నరహరి రామకృష్ణాచార్యులు, బగాది మురళి, కృష్ణమాచార్యులు, శ్రీనివాసశర్మ, రామశర్మ తదితరులు పాల్గొన్నారు.
అర్చక, ఉద్యోగ జేఏసీ రాష్ట్ర చైర్మన్
ఉపేంద్రశర్మ


