క్రీడల్లో ప్రావీణ్యంతో మెరుగైన అవకాశాలు
కామేపల్లి: విద్యార్థులు, యువత చదువుకుంటూనే క్రీడల్లో ప్రావీణ్యం సాధించాలని.. తద్వారా ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మెరుగైన అవకాశాలు దక్కుతాయని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు. కామేపల్లిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో తెలంగాణ మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఆరెం రవి ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి సీనియర్ పురుషుల కబడ్డీ పోటీలను ఎమ్మెల్యే శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. గెలుపోటములను సమానంగా స్వీకరించాలని, ఓడిపోయిన వారు మరింత కష్టపడితే విజయాలు దక్కుతాయని చెప్పారు. ఇండియన్ మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కె.రాంరెడ్డి మాట్లాడుతూ పోటీలకు 33 జిల్లాల జట్లు హాజరుకాగా, విజేతలను జాతీయ స్థాయికి ఎంపిక చేస్తామని తెలిపారు. అసోసియేషన్ రాష్ట్ర, జిల్లా ప్రధాన కార్యదర్శులు తిరుపతి, ఈసం రంగారావు, తెలంగాణ వ్యవసాయ రైతుల సంక్షేమ కమిషన్ డైరెక్టర్ రాంరెడ్డి గోపాల్‌రెడ్డి, సర్పంచ్ అజ్మీరా బుల్లి, ఎస్సై శ్రీకాంత్‌తో పాటు గింజల నరసింహారెడ్డి, పుచ్చకాయల వీరభద్రం, గుజ్జర్లపూడి రాంబాబు, తోటకూరి శివయ్య, రాంరెడ్డి జగన్నాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


