ఆప సోపానాలు!
కరకట్ట మెట్లు ఎక్కి దిగడమంటే ఇబ్బంది
పుష్కరఘాట్ల వద్ద ర్యాంపుల
నిర్మాణంలో నిర్లక్ష్యం
రెండు దశాబ్దాలైనా మారని పరిస్థితి
మెట్లతో ఇబ్బందులు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: వైకుంఠ ఏకాదశి వేడుకలకు భద్రాచల పుణ్యక్షేత్రం ముస్తాబవుతోంది. శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే ముక్కోటి పర్వదినం రోజున భద్రాచలం వచ్చే భక్తుల్లో చాలా మందికి గోదావరిలో పుణ్యస్నానం ఆచరించడం అందని ద్రాక్షే అవుతోంది. పుష్కరఘాట్ల వద్ద ఉన్న మెట్లు ఎక్కి, దిగడమంటే తీవ్ర ఇబ్బందిగా మారింది.
తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా..
భద్రాచలం పుణ్యక్షేత్రంలో సీతారాముల దర్శనానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా వస్తుంటారు. వారంతా గోదావరిలో పుణ్యస్నానాలు చేయాలని కోరుకుంటారు. స్నానం వీలు పడకుంటే కనీసం గోదావరి నీటిని తలపై చిలకరించుకుంటారు. అయితే గోదావరి వరదల నుంచి భద్రాచలానికి రక్షణ కల్పించేందుకు 2002లో కరకట్ట నిర్మించారు. వానాకాలం మినహాయిస్తే మిగిలిన రోజుల్లో గోదావరి ఇక్కడ 20 అడుగుల ఎత్తుకు అటు ఇటుగా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ ప్రవాహంలోనే భక్తులు పుణ్యస్నానాలు చేస్తుంటారు. పితృ తర్పణాలు వదులుతుంటారు. దీపారాధన వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక అయ్యప్ప, హనుమాన్ మాలధారులు కచ్చితంగా నదీ స్నానం ఆచరిస్తారు.
అందుబాటులో లేని ర్యాంప్‌లు
ప్రజలు వినియోగించే అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద రాకపోకలు సాగించేందుకు వీలుగా గతంలో మెట్లు ఉండేవి. అయితే దివ్యాంగులు, మోకాళ్ల నొప్పులున్న వారు మెట్లను ఉపయోగించడం ఇబ్బందిగా మారింది. దీంతో జన సమూహం వచ్చిపోయే దగ్గర ప్రభుత్వం ర్యాంపులను తప్పనిసరి చేసింది. ప్రస్తుతం పాఠశాల, ఆస్పత్రి, బస్టాండ్, రైల్వేస్టేషన్, పోలీస్ స్టేషన్, కాలేజీలు, సులభ్ కాంప్లెక్స్‌ల వద్ద కూడా ర్యాంపులు ఉంటాయి. మెట్ల మార్గంలో రాకపోకలు సాగించలేని వారు ఈ ర్యాంపులను ఉపయోగించుకుంటున్నారు. ఇక వృద్ధుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని బస్సులు, రైళ్లలో సైతం వారికి ముందు వరుసలోనే సీట్లు కేటాయిస్తారు. కానీ ఇలాంటి ప్రత్యేక సౌకర్యలేమీ భద్రాచలం వచ్చే భక్తులకు మాత్రం అందుబాటులో లేవు.
ఏరు పేరుతో మెట్లు
ముక్కోటి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా యంత్రాంగం ఏరు పేరుతో వేడుకలు నిర్వహిస్తోంది. గతేడాది భద్రాచలం కరకట్ట వద్ద వెదురు బొంగులు, రెడీమేడ్ టెంట్లతో ఏరు సిటీని నిర్మించింది. కానీ భక్తులు, పర్యాటకులను ఆకట్టుకోవడంలో ఈ టెంట్ సిటీ విఫలమైంది. మరోవైపు దుమ్ముగూడెం మండలం బొజ్జిగుప్పలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు సైతం ఇవే బాటలో నడిచాయి. దీంతో ఈసారి పర్యాటకులను టెంట్‌సిటీకి ఆకర్షించేందుకు కొత్తగా కరకట్ట నుంచి టెంట్‌సిటీకి వెళ్లేందుకు అనువుగా మెట్లు నిర్మించారు. ఇదే తరహాలో మెట్లు ఎక్కేందుకు ఇబ్బంది పడుతున్న భక్తులను దృష్టిలో ఉంచుకుని ర్యాంపులు కూడా నిర్మించా ల్సిన అవసరం ఉంది.
గోదావరిలో పుణ్యస్నానాలకు భక్తుల ఆసక్తి
భద్రాచలం వచ్చే భక్తులు గోదావరిలో స్నానం చేయాలంటే 80 అడుగుల ఎత్తుతో ఉన్న కరకట్ట దాటి వెళ్లాలి. కరకట్టపైకి వెళ్లేందుకు 48 మెట్లు ఎక్కాల్సి ఉండగా, అక్కడి నుంచి గోదావరిలోని నీటి పాయల వద్దకు వెళ్లేందుకు 93 మెట్లు దిగాల్సి వస్తోంది. దీంతో మెకాళ్ల నొప్పులు ఉన్న భక్తులు ఈ మెట్లు ఎక్కి దిగేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. గోదావరిలో స్నానం చేయాలని, అక్కడి నీటిని తలపై చల్లుకోవాలనే కోరిక తీరకుండానే తిరిగి వెళ్తున్నారు. ఇక సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు, గోదావరి స్నానాన్ని సెంటిమెంట్‌గా భావించే వారు నొప్పులను పంటి బిగువున భరిస్తూ గోదావరిలోకి వెళ్లి వస్తున్నారు. ప్రతీ రోజు కనీసం పదుల సంఖ్యలో ఇలాంటి ఇబ్బందికర దృశ్యాలు కరకట్ట వెంట కనిపిస్తాయి. ఇక ముక్కోటి, శ్రీరామనవమి, కార్తీక పౌర్ణమి, ఆదివారం, ఇతర సెలవులు/ పర్వదినాల్లో అయితే వందలు, వేల సంఖ్యలో భక్తులు మెట్లు ఎక్కి దిగేందుకు ఇక్కట్లు పడుతుంటారు. ముఖ్యంగా వయసు పైబడిన వారి కష్టాలైతే వర్ణణాతీతం.


