కాలినడకన తడ‘బడి’..
చదువుకునేందుకు రెండు కి.మీ.వెళ్తున్న విద్యార్థులు
కాల్వలు, పొలం గట్ల మీదుగా నడక..
ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేయాలంటున్న తల్లిదండ్రులు
పట్టించుకోని అధికారులు
దుమ్ముగూడెం: ఆ ఊర్లో 3 నుంచి 5వ తరగతి వరకు చదివే చిన్నారులు 28 మంది ఉన్నారు. కానీ గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రం మినహా ప్రభుత్వ పాఠశాల లేదు. దీంతో విద్యార్థులకు రెండు కిలోమీటర్ల దూరంలోని పక్క గ్రామాల్లో గల సర్కారు బడులే శరణ్యం. కాలినడకన వెళ్లేందుకు సరైన రహదారి సౌకర్యం కూడా లేదు. కాల్వలు, పొలం గట్లు దాటుతూ వెళ్లాల్సి వస్తోంది. తమ గ్రామంలో కనీసం ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
కాల్వ దాటాల్సిందే..
దుమ్ముగూడెం మండలంల మాంగ్వాయిబాడ్వ గ్రామంలో ప్రాథమిక పాఠశాల లేక చిన్నారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దీంతో విద్యార్థులు రెండు కిలోమీటర్ల దూరం నడిచి అంజుబాక లేదంటే శ్రీనగర్ కాలనీ పాఠశాలలకు వెళ్లాల్సి వస్తోంది. ఆ గ్రామాలకు వెళ్లాలన్నా.. కనీసం రహదారి సౌకర్యం కూడా లేదు. తాలిపేరు బ్యాకింగ్ కాల్వ, పొలం గట్ల మీదుగా నడవాల్సి వస్తోందని తల్లిదండ్రులు, స్థానికులు చెబుతున్నారు. తమ పిల్ల లు బడికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేంత వరకూ భయం భయంగా గడుపుతున్నామని, పిల్లలు సైతం ఇబ్బంది పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంటుందని, ఈ పరిస్థితి తెలిసినా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
అధ్వానంగా రహదారి..
గ్రామంలోని రహదారి అధ్వానంగా, గోతులమయంగా మారింది. అయినా ఈ మార్గంలోనే పిల్లలు బడికి నడిచి వెళ్లాల్సి వస్తోంది. గ్రామంలో రోడ్డు నిర్మాణాలు చేపట్టక సంవత్సరాలు గడుస్తున్నాయని, ఏ నాయకుడూ తమ సమస్యను పట్టించుకోవడం లేదని స్థానికులు అంటున్నారు. వర్షాకాలంలో రోడ్డంతా బురదమయం అవుతోందని, ఇప్పటికై నా పాలకులు, అధికారులు దృష్టి సారించి రహదారి నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు. అంతేకాకుండా విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు, గ్రామస్తులు వేడుకుంటున్నారు.
కాలినడకన తడ‘బడి’..


