వేగంగా ముక్కోటి ఏర్పాట్లు
● చకచకా ర్యాంప్, హంసవాహన పనులు ● ఏర్పాట్లను పరిశీలించిన ఈఓ
భద్రాచలం: భద్రాచలం దివ్యక్షేత్రంలో ఈ నెల 29, 30వ తేదీల్లో జరిగే తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ప్రధానంగా తెప్పోత్సవ పనులు వేగవంతమయ్యాయి. హంసాకృతికి సంబంధించిన చెక్కలకు రంగులు వేసి లాంచీకి అమర్చారు. హంసవాహనంపైకి స్వామి వారిని తీసుకెళ్లేందుకు ర్యాంప్ పనులు సైతం వేగంగా జరుగుతున్నాయి. పనులు పూర్తయ్యాక అన్ని శాఖల అధ్వర్యంలో ట్రయల్‌రన్ నిర్వహిస్తారు. అలాగే గతేడాది ప్రత్యేకాకర్షణగా నిలిచిన సాంస్కృతిక కార్యక్రమాలను ఈ ఏడాది సైతం ఏరు ఉత్సవంలో భాగంగా మూడు రోజుల పాటు ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేక సిబ్బందితో పారిశుద్ధ్య పనులు చేయిస్తున్నారు. భక్తులకు అవసరమైన లడ్డూలు తయారు చేయడంతో పాటు విక్రయానికి కౌంటర్లను సిద్ధం చేస్తున్నారు. ఇక ఉత్తర ద్వార దర్శనానికి సెక్టార్‌ల విభజన చేయాల్సి ఉంది. కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఇప్పటికే పలుమార్లు ఏర్పాట్ల పనులను పరిశీలించి దిశా నిర్దేశం చేశారు.
పూర్తి కావొచ్చిన టికెట్ల విక్రయం
ఉత్తర ద్వార దర్శనానికి ఆన్‌లైన్‌లో ఉంచిన వివిధ సెక్టార్ల టికెట్ల విక్రయం దాదాపు పూర్తి కావొచ్చింది. మొత్తం 1,777 టికెట్లకు 1,167 టికెట్లను భక్తులు కొనుగోలు చేయగా ఇంకా 610 టికెట్లు మిగిలాయి. ఇందులో రూ.2వేల విలువ గల 487 టికెట్లు పూర్తిగా, రూ.500 విలువైన సెక్టార్ సీ, డీ టికెట్లు సైతం పూర్తిగా అమ్ముడుపోయాయి. రూ.1000 విలువ గల 75 టికెట్లు, రూ.500 విలువ గల సెక్టార్ బీ టికెట్లు 263, రూ.250 విలువ గల 272 టికెట్లు అందుబాటులో ఉన్నాయని ఆలయ అధికారులు వెల్లడించారు.


