స్నేహభావంతో మెలగాలి
భద్రాచలంటౌన్ : క్రీడాకారులు స్నేహభావంతో మెలగాలని, గెలుపోటములను సమానంగా స్వీకరించాలని ఐటీడీఏ పీఓ బి. రాహుల్ అన్నారు. గిరిజన మ్యూజియం ఆధ్వర్యంలో నిర్వహించిన ఔట్‌డోర్ షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ గురువారంతో ముగిసింది. ఈ సందర్భంగా జరిగిన వేడుకల్లో ఆయన విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. క్రీడాకారులు పట్టుదలతో ఆడి నైపుణ్యాన్ని ప్రదర్శించారని అభినందించారు. త్వరలో మ్యూజియంలో పాఠశాల విద్యార్థులతో ‘కల్చరల్ వీకెండ్’ కార్యక్రమాలు చేపడతామన్నారు. పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన కుంజా సురేష్ కుమార్ – సోడె శ్రీను జంటకు రూ.8 వేలు, ద్వితీయ బహుమతి సాధించిన తాటి పవన్ – సాయికి రూ.6 వేలు, తృతీయ స్థానంలో నిలిచిన కిరణ్ – లక్ష్మణ్‌కు రూ.4 వేలు, నాలుగో స్థానం సాధించిన హరీష్ బృందానికి రూ.2 వేల నగదుతో పాటు మెమెంటోలు అందజేశారు. కార్యక్రమంలో కీడ్రాధికారులు గోపాల్ రావు, నాగేశ్వరరావు, రాంబాబు, ముత్తయ్య, హరికృష్ణ, గొంది వెంకటేశ్వర్లు, విజయరావు, కృష్ణ ప్రసాద్, మల్లేష్, రాజా రమేష్, బాలకిరణ్, వరుణ్ నాగరాజ్ పాల్గొన్నారు.


