ఖర్చులు పక్కాగా
వ్యయ వివరాలు
సమర్పించాల్సిన గడువు
విడతల వారీగా పోటీ చేసిన అభ్యర్థులు (ఏకగ్రీవాలు మినహా)
● సర్పంచ్, వార్డు అభ్యర్థులకు నోటీసులు ● గెలిచిన, ఓడిన వారే కాక ఏకగ్రీవ స్థానాల్లో కూడా తప్పనిసరి ● విడతల వారీగా గడువు ప్రకటించిన అధికారులు
అప్పగించాల్సిందే..
వైరా/నేలకొండపల్లి: గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం కూడా పూర్తి చేశారు. ఓడిన వారే కాక గెలిచిన వారు అప్పుల లెక్కలు వేసుకుంటున్నారు. ఈక్రమాన పోటీ చేసిన అభ్యర్థులంతా వ్యయం వివరాలు సమర్పించాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ మేరకు గ్రామ కార్యదర్శుల ద్వారా నోటీసుల జారీకి సిద్ధమవుతున్నారు. సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలుపు కోసం అడ్డుగోలుగా ఖర్చు చేసిన అభ్యర్థులు నిబంధనల ప్రకారం ప్రతీ రూపాయి లెక్క చెప్పాల్సి ఉంటుంది. లేదంటే అనర్హత వేటు పడే ప్రమాదముంది. ఖర్చు చేయడం ఒక ఎత్తయితే దానిని నిబంధనల ప్రకారం చెప్పడం తలకు మించిన భారం కావడంతో అభ్యర్థులు మల్లగుల్లాలు పడుతున్నారు. కాగా, వ్యయ వివరాలు సమర్పించేందుకు 45 రోజులు గడువు ఇవ్వనుండగా, ఈసారి ముందుగానే గడువు విధించడం గమనార్హం.
సమర్పించకపోతే వేటే..
ఎన్నికల సంఘం నిబంధల ప్రకారం సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసిన అభ్యర్థులు వారికి గుర్తులు కేటాయించిన రోజు నుంచి ఫలితాలు వెలువడే వరకు చేసిన ఖర్చు వివరాలను ఎంపీడీఓలకు సమర్పించారు. లేనిపక్షంలో పంచాయతీ రాజ్ చట్టం 2018లోని సెక్షన్ 23 ప్రకారం వేటు పడుతుంది. గెలిచిన అభ్యర్థులు పదవి కోల్పోనుండగా.. మూడేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధానికి గురవుతారు. ఓడిన వారు సైతం మూడేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోతారు. త్వరలోనే పార్టీ గుర్తులపై జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు జరగనున్నందున అభ్యర్థులు జాగ్రత్త పడాల్సి ఉంది.
మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మూడు విడతలుగా గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. ఖమ్మం జిల్లాకు సంబంధించి ఏకగ్రీవాలు మినహా మొదటి విడతలో 172 జీపీలు, రెండో విడతలో 160, మూడో విడతలో 168 జీపీలకు ఎన్నికలు జరిగాయి. ఇక భద్రాద్రి జిల్లాలో వరుసగా 145, 138, 145 జీపీలకు ఎన్నికలు నిర్వహించారు. ఇప్పటికే సర్పంచ్‌లు, పాలకవర్గాలు ప్రమాణ స్వీకారం చేయగా, నెలకోసారి పాలకవర్గ సమావేశం, రెండు నెలలకోసారి గ్రామసభ నిర్వహించాల్సి ఉంటుంది. పంచాయతీ వార్షిక ఆడిట్లు, లెక్కలు పూర్తి చేయకపోయినా, అవినీతికి పాల్పడినా పదవి కోల్పోయే ప్రమాదం ఉన్న నేపథ్యాన సర్పంచ్‌లకు అవగాహన కల్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎంపీడీఓలకు.. ఆపై ఆన్‌లైన్‌లో
సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసిన అభ్యర్థులు తాము చేసిన ఖర్చుల వివరాలను ఎంపీడీఓలకు అందజేసి రశీదు తీసుకోవాలి. ఆపై వివరాలను టీ–పోల్ సైట్‌లో ఫిబ్రవరి 15వ తేదీలోగా నమోదు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతీ మండలంలో ఒక కంప్యూటర్ ఆపరేటర్‌ను కేటాయించాలని ఎంపీడీఓలకు ఆదేశాలు అందాయి. కాగా, 5 వేల లోపు జనాభా ఉన్న జీపీల్లో సర్పంచ్‌గా పోటీ చేసిన అభ్యర్థి గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు ఖర్చు చేసే అవకాశముంది. వార్డు సభ్యులైతే రూ.30 వేల వరకు ఖర్చులు చూపించవచ్చు. ఇక 5 వేలకు పైగా జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థి రూ.2.50 లక్షల వరకు, వార్డు అభ్యర్థులు రూ.50 వేల వరకు ఖర్చు చేసే అవకాశముండగా, పూర్తి వివరాలతో లెక్కలు అప్పగించాల్సి ఉంటుంది.
విడత గడువు తేదీ
మొదటి విడత అభ్యర్థులు జనవరి 03
రెండో విడత జనవరి 06
మూడో విడత జనవరి 09
జిల్లా మొదటి విడత రెండో విడత మూడో విడత
సర్పంచ్‌లు వార్డుసభ్యులు సర్పంచ్‌లు వార్డుసభ్యులు సర్పంచ్‌లు వార్డుసభ్యులు
ఖమ్మం 488 3,424 451 3,352 485 3,369
భద్రాద్రి 461 2,567 386 2,820 470 2,802


