ఐటీడీఏ కబడ్డీ జట్టుకు కాంస్యం
భద్రాచలంటౌన్: కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం పోర్టు స్టేడియంలో నిర్వహించిన జాతీయస్థాయి పీసా మహోత్సవాల్లో భద్రాచ లం ఐటీడీఏ క్రీడాకారులు సత్తా చాటారు. పురుషుల కబడ్డీ విభాగంలో జట్టు మూడో స్థానంలో నిలిచి బ్రాంజ్ (కాంస్యం) పతకం కై వసం చేసుకుంది. బుధవారం జరిగిన ముగింపు వేడుకల్లో కేంద్ర పంచాయతీరాజ్ కార్యదర్శి వివేక్ భరద్వాజ్, డైరెక్టర్ రమిత్ మౌర్య, ఏపీ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్‌కుమార్ చేతుల మీదుగా ఐటీడీఏ ఏపీఓ డేవిడ్‌రాజ్, క్రీడాకారులు పతకంతో పాటు రూ.50 వేల నగదు పారితోషికాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీఓ బి.రాహుల్ క్రీడాకారులను అభినందించారు. మహోత్సవంలో భద్రాచలం ఐటీడీఏ ఏర్పాటు చేసిన గిరిజన వంటకాల స్టాల్, కోయా క్రాఫ్ట్ వస్తువులు పది దేశాల ప్రతినిధులను విశేషంగా ఆకట్టుకున్నాయని పీఓ తెలిపారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఏఓ సున్నం రాంబాబు, స్పోర్ట్స్ ఆఫీసర్ జ్యోతి, సుభాష్‌చంద్రగౌడ్, సుధారాణి, దుర్గ, లత, నిఖిల్, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
పేద యువతుల
వివాహాలకు చేయూత
ఖమ్మంమామిళ్లగూడెం: ఇద్దరు పేద, అనాథ యువత వివాహానికి ఆవామే హింద్ అండ్ వెల్ఫేర్ చారిటబుల్ ఫౌండేషన్, ముస్లిం ఐక్య సంఘం బాధ్యులు చేయూతగా నిలిచారు. ఖమ్మానికి చెందిన యువతి వివాహానికి రూ.25 వేల విలువైన సామగ్రి, భద్రాద్రి జిల్లా పెన గడప యువతి వివాహానికి రూ.10 వేల విలువైన సామగ్రిని బుధవారం అందజేశారు. ఫౌండేషన్ చైర్మన్ హఫీజ్ మహ్మద్ జవ్వాద్ అహ్మద్‌తో పాటు సంస్థల బాధ్యులు పాల్గొన్నారు.
పోలీసులు
అదుపులో ప్రవీణ్?
సత్తుపల్లి: హైదరాబాద్ కేంద్రంగా సైబర్ నేరా లకు పాల్పడి పలువురి నుంచి రూ.కోట్లలో నగ దు కాజేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్లూరు మండలం ఎర్రబోయినపల్లికి చెందిన పోట్రు ప్రవీణ్‌ను సత్తుపల్లి రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఆయనను హైదరాబాద్ నుంచి బుధవారం రాత్రి వీఎం బంజర పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చినట్లు సమాచారం. సైబర్ నేరాల ద్వారా సంపాదించిన నగదును గ్రామపంచాయతీ ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చుపెట్టినట్టు ఆరోపణలు రాగా, ఓడిపోయిన అభ్యర్థులు పలువురు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈక్రమాన ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించడం లేదు.
15ఏళ్ల తర్వాత
కుటుంబం చెంతకు..
ఖమ్మంఅర్బన్: మతిస్థిమితం కోల్పోయి అచేతనంగా పడి ఉన్న వ్యక్తికి సపర్యలు చేసిన అన్నం ఫౌండేషన్ బాధ్యులు ఆయన కోలుకున్నాక వివరాలు తెలుసుకుని కుటుంబం చెంతకు చేర్చారు. ఖమ్మం సమీపాన సదరు వ్యక్తి తిరుగుతుండగా కొన్నాళ్ల క్రితం అన్నం సేవా ఫౌండేషన్‌లో చేర్చుకున్న నిర్వాహకుడు శ్రీనివాసరావు వైద్యం చేయించారు. ఇటీవల కోలుకున్న ఆయన తన పేరు కనగాల చలపతిరావు అని స్వస్థలం ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి అని చెప్పడంతో బుధవారం అక్కడకు తీసుకెళ్లి గ్రామపెద్దల సమక్షాన కుటుంబానికి అప్పగించారు. పదిహేనేళ్ల క్రితం మతిస్థిమితం కోల్పోయిన ఆయన ఇంటి నుంచి వెళ్లిపోవడంతో ఎక్కడ తిరిగినా ఆచూకీ లభించలేదని కుటుంబీకులు తెలిపారు. ప్రస్తుతం చలపతిరావు తమ చెంతకు చేరడంతో వారు అన్నం శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలిపారు.
రైలు ఢీకొని టైలర్ మృతి
ఖమ్మంక్రైం: పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఖమ్మం గాంధీచౌక్‌లో టైలర్‌గా పనిచేస్తున్న బుర్హాన్‌పురానికి చెందిన రామగిరి రాములు(75) బుధవారం సాయంత్రం ఇంటికి వెళ్తున్నాడు. ఈక్రమాన పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొనడంతో మృతి చెందాడు. ఆయన మృతదేహన్ని అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సహకారంతో మార్చురీకి తరలించినట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు తెలిపారు.
ఐటీడీఏ కబడ్డీ జట్టుకు కాంస్యం


