● నేత్రపర్వంగా సాగుతున్న అధ్యయనోత్సవాలు ● కెమిస్ట్, డ్
వామనావతారం.. సుమనోహరం
భద్రాచలం : బలి చక్రవర్తి గర్వమును అణిచేందుకు వెలిసి మూడు అడుగులను కోరి రాక్షసరాజుకు గర్వభంగం చేసిన వామనావతారంలో దర్శనమిచ్చిన భద్రగిరి రామయ్యకు భక్తులు నీరాజనం పలికారు. భద్రాచల దేవస్థానంలో కొనసాగుతున్న వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు బుధవారం ఐదో రోజుకు చేరుకోగా, సీతాలక్ష్మణ సమేతుడైన రామచంద్రమూర్తి వామనావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత గర్భగుడిలో సుప్రభాత సేవ, ఆరాధన నిర్వహించారు. ఆ తర్వాత అర్చకులు బేడా మండపంలో పూజలు నిర్వహించగా, వేద పండితులు 200 పాశురాల ప్రంబంధాలను సమర్పించారు.
వైభవంగా శోభాయాత్ర
పగల్ పత్తు ఉత్సవాల్లో భక్తులను భాగస్వాములను చేయాలని ఆలయ అధికారులు నిర్ణయించిన నేపథ్యంలో బుధవారం కెమిస్ట్, డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు. డివిజన్ అధ్యక్షుడు పరిమి సోమశేఖర్ ఆధ్వర్యంలో స్వామివార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. స్వామివారిని ప్రత్యేక పల్లకీలో వేంచేపుజేసి ఊరేగింపుగా మిథిలా స్టేడియానికి తీసుకొచ్చారు. అక్కడి వేదికపై ఉన్న స్వామివారిని భక్తులు దర్శించుకున్నాక తిరువీధి సేవ నిర్వహించారు.
నేడు పరశురామావతారం
వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా స్వామివారు గురువారం పరశురామావతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. శ్రీ మహావిష్ణువు జమదగ్ని అనే మహర్షికి కుమారుడిగా జన్మించి పరశురాముడు(భార్గవరాముడు) అని పిలవబడుతూ దుష్టులైన కార్తవీర్యార్జునుని, దుర్మార్గులైన రాజులను ఇరవై ఒక్కసార్లు దండెత్తి సంహరించి ధర్మాన్ని స్థాపించాడు. శుక్రగ్రహ బాధలున్నవారు ఈ అవతారాన్ని దర్శిస్తే శుభ ఫలితాలు పొందుతారని ప్రతీతి.


