వినియోగదారుల హక్కులు కాపాడాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ మాట్లాడుతూ.. వినియోగదారులు రాయితీలు, ఉచిత ప్రకటనలను ఆన్‌లైన్‌లో చూసి మోసపోవద్దన్నారు. ఇలాంటి మోసాలను హ్యాకర్లు గుర్తించి దోచేస్తారని, పాస్‌వర్డ్‌ను సులువుగా పెట్టుకోవద్దని, ఓటీపీలను ఇతరులతో పంచుకోవద్దన్నారు. కొనుగోలు చేసిన వస్తువు తయారీ, చిరునామా, గడువు తేదీ, కస్టమర్ కేర్ నంబర్‌ను సరి చూసుకోవాలని సూచించారు. కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకు రశీదు తప్పనిసరిగా తీసుకోవాలని, డిజిటల్ పేమెంట్లు, క్యూఆర్ కోడ్, మొబైల్ యాప్ ద్వారా చెల్లింపుల్లో వినియోగదారులు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. రైతులు విత్తనాలు, మందులు కొనేటప్పుడు బోగస్ కంపెనీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, మోసానికి గురైతే వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయాలని సూచించారు. అనంతరం పలు అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ అధికారి ప్రేమ్‌కుమార్, పౌరసరఫరాల శాఖ మేనేజర్ త్రినాథ్‌బాబు, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ వెంకటరమణ, వాలంటరీ ఆర్గనైజర్ జూలూరి రఘుమాచారి, గుగులోతు బాలు, మహమ్మద్ రియాజ్, శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ వేణుగోపాల్


