బలమైన శక్తిగా కాంగ్రెస్
సూపర్‌బజార్(కొత్తగూడెం): రాష్ట్రంలో కాంగ్రెస్ బలమైన శక్తిగా ఎదుగుతోందని, తమ పార్టీలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథ్ తెలిపారు. కొత్తగూడెంలో మంగళవారం జరిగిన జిల్లా కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సమష్టి కృషితో జిల్లాలో పార్టీని మరింతగా బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో పార్టీ మద్దతుతో పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. మహిళలకు కాంగ్రెస్ పెద్దపీట వేస్తోందని చెప్పడానికి డీసీసీ పదవుల్లో వారికి ప్రాధాన్యత కల్పించడమే నిదర్శనమన్నారు. పార్టీ కోసం కష్టపడే పనిచేసే వారికి ఎప్పుడూ ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించారు. రాష్ట్రంలోనే పెద్దదైన భద్రాద్రి జిల్లాకు కూడా మహిళా అధ్యక్షురాలినే నియమించామని గుర్తు చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పేరు మార్చాలని మోడీ ప్రభుత్వం చేసే కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఆర్‌ఎస్‌ఎస్ దురాగతాలకు బలైన నాయకుల పేర్లను మార్చాలని చూడడం దుర్మార్గమైన చర్య అని అభివర్ణించారు. సమావేశంలో అశ్వారావుపేట, ఇల్లెందు, పినపాక ఎమ్మెల్యేలు జారె ఆదినారాయణ, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు నాగ సీతారాములు, మోత్కూరి ధర్మారావు, డీసీసీ అధ్యక్షురాలు తోట దేవీప్రసన్న, ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ జె.బి. శౌరి, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చీకటి కార్తీక్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు తదితరులు పాల్గొన్నారు.
ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాఽథ్


