అత్యున్నత అభ్యసన వైపు..
ఎంపికై న పాఠశాలలు ఇవే..
విద్యార్థులకు నాణ్యమైన విద్య
అందేలా చర్యలు
ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన విద్యాశాఖ
విద్యా ప్రమాణాల పెంపునకు
కీలక అడుగు
ఎంపికై న పాఠశాలల్లో
త్వరలో అభివృద్ధి పనులు
కరకగూడెం: పేద విద్యార్థుల విద్యా ప్రమాణాలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగువేసింది. ప్రభుత్వ పాఠశాలలను సమూలంగా బలోపేతం చేసి, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా నాణ్యమైన విద్య అందించేందుకు ప్రతీ మండలానికి ఒక బెస్ట్ స్కూల్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ బృహత్తర లక్ష్యాన్ని సాధించే దిశగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 23 మండలాల నుంచి విద్యార్థుల సంఖ్య, వసతులు, ఉపాధ్యాయుల లభ్యత ఆధారంగా ఎంపిక చేసిన పాఠశాలల ప్రతిపాదనలను జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు గత నెలలో ప్రభుత్వానికి పంపారు. పూర్వ ప్రాథమిక స్థాయి నుంచి పదో తరగతి వరకు పూర్తిస్థాయి మౌలిక వసతులు, డిజిటల్ తరగతి గదులు, పక్కా భవనాలతో ఇవి రూపుదిద్దుకోనున్నాయి.
మౌలిక వసతుల కల్పన..
ఎంపికై న బెస్ట్ పాఠశాలల్లో పూర్తిస్థాయిలో మౌలిక వసతులను కల్పించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని వాతావరణంలో విద్యను అభ్యసించేలా చర్యలు చేపట్టనున్నారు. ఆధునిక డిజిటల్ తరగతి గదులు, సౌకర్యవంతమైన ఫర్నిచర్, మెరుగైన తాగునీరు, పరిశుభ్రమైన టాయిలెట్లు, పూర్తిస్థాయి ప్రయోగశాలలు, గ్రంథాలయాల ఏర్పాటుతోపాటు నూతనంగా పెయింటింగ్ వేయనున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు అందిన వెంటనే ఈ ఎంపికై న పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టనున్నారు. ఈ చర్యల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు నమోదు పెరిగి, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య చేరువ చేయాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని విద్యావేత్తలు అభిప్రాయ పడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతి మండలంలో ఉత్తమ పాఠశాల ఏర్పాటు కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని జిల్లా స్థాయిలో అమలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ కార్యక్రమం కేవలం భవనాల నిర్మాణం లేదా సౌకర్యాల జోడింపు కాదు. ప్రతి విద్యార్థికి ఉన్నత స్థాయి అభ్యాస అనుభవాన్ని అందించాలనే సమష్టి నిబద్ధతకు అద్దం పడుతుంది. విద్యారంగంలో సమానత్వాన్ని సాధించడం, అత్యంత వెనుకబడిన విద్యార్థికి కూడా మెరుగైన అవకాశాలను కల్పి ంచడం ఈ మిషన్ ప్రధాన లక్ష్యం. ప్రభుత్వ ఆదేశాలు అందిన వెంటనే ఈ నమూనా పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపుదల, వృత్తిపరమైన ఉపాధ్యాయ శిక్షణ, అత్యాధునిక అభ్యాస వనరుల అందుబాటుపై దృష్టి సారిస్తాం. ఇది విద్యాభివద్ధిలో నవశకం. –నాగలక్ష్మి, డీఈఓ
మండలానికి ఒక బెస్ట్ స్కూల్‌ను ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా జిల్లా విద్యాశాఖ అధికారులు కఠినమైన ప్రమాణాలతో కూడిన పాఠశాలలను ఎంపిక చేశారు. ఈ ఎంపిక ప్రక్రియ జాతీయ విద్యా విధానాన్ని దృష్టిలో ఉంచుకుని చేపట్టినట్లు తెలుస్తోంది. పాఠశాలల్లో విద్యార్థుల నమోదు అధికంగా ఉండేలా, అన్ని సబ్జెక్టులు బోధించడానికి సరిపడా ఉపాధ్యాయులు అందుబాటులో ఉండి పక్కా భవనం కలిగి ఉండడంతో పాటు క్రీడా మైదానం తప్పనిసరిగా ఉండేలా చూసుకున్నారు. ప్రస్తుతం ఒకే ఆవరణలో ప్రాథమికస్థాయి నుంచి పదో తరగతి వరకు విద్యాబోధన కొనసాగుతున్న పాఠశాలలను ఎంపిక చేశారు. జిల్లాలో ఆళ్లపల్లి, అశ్వారావుపేట, చండ్రుగొండ, గుండాల, కరకగూడెం, జూలూరుపాడు, ములకలపల్లి, పాల్వంచ జెడ్‌పీహెచ్‌ఎస్‌లతో పాటు అన్నపురెడ్డిపల్లిలో ఎరగ్రుంట, అశ్వాపురంలో మల్లెలమడుగు, భద్రాచలం బాలికల జెడ్‌పీహెచ్‌ఎస్, బూర్గంపాడులో మోరంపల్లి, చర్లలో సత్యనారాయణపురం, చుంచుపల్లిలో రుద్రంపూర్, దమ్మపేటలో నాగుపల్లి, దుమ్ముగూడెంలో నర్సాపురం, పినపాకలో ఏడూళ్ల బయ్యారం జెడ్‌పీహెచ్‌ఎస్‌లు ఎంపికయ్యాయి. పాత కొత్తగూడెం ప్రభుత్వ పాఠశాల, లక్ష్మీదేవిపల్లిలో హేమచంద్రాపురం పీఎంశ్రీ జెడ్‌పీహెచ్‌ఎస్, మణుగూరు జెడ్‌పీహెచ్‌ఎస్ కో–ఎడ్యుకేషన్, సుజాతనగర్‌లో పీఎంశ్రీ, టేకులపల్లి ప్రభుత్వ పాఠశాల, ఇల్లెందు జెడ్‌పీహెచ్‌ఎస్, సుభాష్‌నగర్ ప్రభుత్వ పాఠశాలలను కూడా ఎంపిక చేశారు.
ప్రతి మండలానికో
బెస్ట్ స్కూల్ ఏర్పాటు
అత్యున్నత అభ్యసన వైపు..
అత్యున్నత అభ్యసన వైపు..


