కిన్నెరసాని రోడ్డులో ట్రాఫిక్‌జామ్
పాల్వంచరూరల్: బూడిద లారీలను రోడ్డుపై గంటల తరబడి నిలిపివేయడంతో రాత్రి సమయంలో కిన్నెరసానివైపు వాహనదారులు వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారు. పట్టణ శివారు కరకవాగు వద్ద కేటీపీఎస్ యాష్‌పాండులోపలికి వెళ్లే బూడిద లారీలను రాత్రి సమయంలో కిన్నెరసానిరోడ్డులో నిలుపుతున్నారు. దీంతో కిన్నెరసాని నుంచి పాల్వంచకు, పాల్వంచ నుంచి కిన్నెరసాని, ఉల్వనూరు వైపు వెళ్లే వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం రాత్రి కూడా బూడిద లారీలు రోడ్డుపై నిలిపివేయడంతో ట్రాఫిక్ జామ్ కావడంతో లారీల డ్రైవర్లతో వాహనదారులు గొడవ పడ్డారు. నిత్యం గొడవ జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విద్యుత్ ప్రైవేటీకరణకు
నిరసనగా ధర్నా
పాల్వంచ: కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ విధానాలకు నిరసనగా నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజనీర్స్ పిలుపు మేరకు కేటీపీఎస్ టీజీపీఈఏ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక కేటీపీఎస్ అంబేడ్కర్ సెంటర్‌లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రాంచ్ సెక్రటరీ డి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన న్యూక్లియర్ బిల్లును రద్దు చేయాలని, విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ విధానాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బ్రహ్మాజీ, యాస్మిన్, మహేశ్, రాధాకృష్ణ, గిరిధర్, వెంకటేశ్వర్లు, రవీందర్, నాగేశ్వరరావు, జయభాస్కర్, అఖిలేశ్, శ్రీపాల్, యాకూబ్, పావని, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఎవ్వరూ లేని అనాథ..
● చలికి వణుకుతూ
భిక్షాటన చేస్తున్న వృద్ధుడు
ఇల్లెందురూరల్: మండలంలోని కరెంటాఫీసు ఏరియాలో కొంతకాలంగా గుగులోత్ దేవ్లా రోడ్డుపై పాకుతూ భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మండలంలోని వేపగలగడ్డ తండాకు చెందిన దేవ్లా బార్య నీలా, కుమారుడు రవి ఇరువురు మృతి చెందడంతో ప్రస్తుతం అతను ఎవరూ లేని అనాథ అయ్యాడు. నడవలేని స్థితిలో ఉన్న ఇతడికి సొంత ఇల్లు కూడా లేదు. ఎవరైనా ఆదరిస్తారన్న ఆశతో బతుకు ఈడుస్తున్న ఈ వృద్ధుడు కరెంటాఫీసు ఏరియాలో చలికి వణుకుతూ భిక్షాటన చేస్తున్నాడు. రెండు కాళ్లు చచ్చుబడిన ఇతడికి అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వికలాంగుల ధ్రువీకరణ పత్రం ఇప్పించి పింఛన్ మంజూరు చేయించాలని స్థానికులు కోరుతున్నారు.
28న కవయిత్రి ఓల్గాకు పౌరసన్మానం
ఖమ్మం మామిళ్లగూడెం: ప్రముఖ కవయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఓల్గాకు ఈనెల 28న పౌరసన్మానం ఏర్పాటుచేసినట్లు స్వేఛ్ఛావరణం నిర్వాహకురాలు సుమ తి తెలిపారు. ఖమ్మంలో మంగళవారం ఆమె మాట్లాడుతూ వేదిక ఫంక్షన్ హాల్‌లో జరిగే సన్మానంలో ప్రముఖ సాహితీ వేత్తలు మృణాళి ని, కాత్యాయని విద్మహే, ప్రతిమ, పాటిబండ్ల రజని తదితరులు హాజరవుతారని వెల్లడించా రు. తొలుత ‘ఓల్గా తీరం’ పుస్తకాన్ని ఆవిష్కరించనుండగా, ఆమెరచనలపై ఎగ్జిబిషన్ ఉంటుందని, నృత్యరూపకాన్ని కూడా ప్రదర్శించనునట్లు తెలిపారు. ఇప్పటికే ఓల్గా రచనలపై నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందచేస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రచయిత్రి వురిమళ్ల సునంద పాల్గొన్నారు.
గడ్డ కట్టిన సిమెంట్
పాల్వంచరూరల్: నాలుగు, ఐదు నెలల కిందట జీపీ భవనం స్లాబ్‌కు వినియోగించిన సిమెంట్ గడ్డగట్టింది. మండలంలోని దంతలబోరు ఎస్సీకాలనీ జీపీ భవన నిర్మాణం కోసం తెప్పించిన సిమెంట్‌ను స్లాబ్‌కు కొంత వినియోగించగా మిగిలినదానిని వదిలేశారు. దీంతో సిమెంట్ బస్తాలు పూర్తిగా గడ్డకట్టిపోయాయి. ఏఈ శ్రీకాంత్‌ను వివరణ కోరగా భవన నిర్మాణం తర్వాత మిగిలిన సిమెంట్ బస్తాలు అక్కడే ఉంచడంతో గడ్డకట్టాయని నష్టం కాంట్రాక్టరే భరిస్తాడన్నారు.
కిన్నెరసాని రోడ్డులో ట్రాఫిక్‌జామ్
కిన్నెరసాని రోడ్డులో ట్రాఫిక్‌జామ్
కిన్నెరసాని రోడ్డులో ట్రాఫిక్‌జామ్


