వేంకటేశ్వర స్వామికి పుష్పయాగం
ఖమ్మంగాంధీచౌక్: ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఖమ్మం కమాన్‌బజార్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం స్వామికి పుష్పయాగం నిర్వహించారు. స్వామివార్ల ఉత్సవ విగ్రహాలతో పాటు ఆలయం ఆవరణను పూలతో అలంకరించారు. అనంతరం ఈఓ కె.వేణుగోపాలాచార్యులు పర్యవేక్షణలో అర్చకులు పుష్పాభిషేకం నిర్వహిచారు. భక్తులతో పాటు గోవింద మాలధారులు,శరణాగతి దీక్ష ధరించిన వారు హాజరయ్యారు.
మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
ఇల్లెందురూరల్: మండలంలోని బాలాజీనగర్‌కు చెందిన సంగం బక్కయ్య (36) మనస్తాపంతో ఇంట్లో ఉరివేసుకొని మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తల్లి చంద్రమ్మ కథనం ప్రకారం.. బక్కయ్య భార్య శిరీషతో తనకు అక్రమ సంబంధం ఉందని సంజయ్‌నగర్‌కు చెందిన తరుణ్ తన కుమారుడికి నేరుగా చెప్పడంతో పెద్దమనుషుల వద్ద పంచాయతీ చేశామని, ఇదే విషయమై రెండు రోజుల క్రితం తరుణ్‌తో ఘర్షణ పడిన బక్కయ్య మనస్తాపంతో మంగళవారం ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లి చంద్రమ్మ ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు సీఐ సురేశ్ తెలిపారు.
చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి
బూర్గంపాడు: మండలంలోని కృష్ణసాగర్ గ్రామ పంచాయతీలోని బట్టిగూడెం వలస ఆదివాసీ గ్రామానికి చెందిన సోడి భీమా (36) పురుగుమందు తాగి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. సోడి భీమాకు నందమ్మతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి పిల్లలు లేకపోవటంతో భీమా మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో నవంబర్ 30వ తేదీన భార్య నందమ్మ కూలి పనులకు వెళ్లిన తరువాత ఇంట్లో పురుగుమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆయన్ను భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ట్రాన్స్‌ఫార్మర్ ధ్వంసం
కరకగూడెం: మండలంలోని వెంకట్రాంపురం గ్రామంలో ట్రాన్స్‌ఫార్మర్‌ను ధ్వంసం చేసిన దుండగులు అందులోని అల్యూమినియం తీగను చోరీ చేశారు. గ్రామానికి చెందిన గొంది బాలకృష్ణ తన పొలంలో ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసు కుని వరి సాగు చేస్తున్నాడు. సోమవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ట్రాన్స్‌ఫార్మర్‌ను ధ్వంసం చేసి, అల్యూమినియం తీగను ఎత్తుకెళ్లారు. బాధితులు మంగళవారం విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా, ఇన్‌చార్జ్ ఏఈ రాజశేఖర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ట్రాన్స్‌ఫార్మర్ సామగ్రి విలువ సుమారు రూ.లక్ష వరకు ఉంటుందని ఆయన వెల్లడించారు.
వేంకటేశ్వర స్వామికి పుష్పయాగం


