ముక్కోటి సజావుగా సాగాలి..
సూపర్‌బజార్(కొత్తగూడెం): ముక్కోటికి హాజర య్యే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని ఎస్పీ రోహిత్‌రాజ్ పోలీస్ అధికారులకు సూచించారు. పోలీస్ హెడ్‌క్వార్టర్లలో మంగళవారం పోలీస్ అధికారులతో సమీక్షించారు. తొలుత పంచాయతీ ఎన్నికల్లో వర్టికల్స్ వారీగా ఉత్తమ ప్రతిభ కనబరిచినవారికి ప్రశంసాపత్రాలు అందించి, మాట్లాడారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి, వాటి నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. ఏడాది చివరలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా నిత్యం వాహన తనిఖీలు చేపట్టాలని, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని పేర్కొన్నారు. పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి సమగ్ర దర్యాప్తు చేపట్టి భాదితులకు న్యాయం చేయాలని, పోక్సో కేసుల్లో నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా కృషి చేయాలని సూచించారు. మాదకద్రవ్యాల రవాణా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపాలని, సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించేవారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఈ నెల 29, 30 తేదీల్లో భద్రాచలంలో జరగనున్న తెప్పోత్సవం, ముక్కోటి ఉత్సవాలు సజావుగా సాగేలా బందోబస్తు ప్రణాళిక రూపొందించాలని చెప్పారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉండాలని, షీ టీమ్స్, భరోసా కేంద్రాల ఆవశ్యకతపై అవగాహన కల్పించాలని ఎస్పీ వివరించారు. సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, డీఎస్పీలు రెహమాన్, మల్లయ్యస్వామి, ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాస్, రమాకాంత్, ఐటీ సెల్ సీఐ రాము తదితరులు పాల్గొన్నారు.
అందుకు అన్ని ఏర్పాట్లు చేయాలి: ఎస్పీ


