వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చుకోవాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): రైతులు వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చుకోవాలని, అడవులను కాపాడుకుంటూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం కిసాన్ సమ్మాన్ దివస్, కిసాన్ మేళా నిర్వహించారు. తొలుత అభ్యుదయ రైతులు వ్యవసాయ పరికరాల స్టాల్‌ను సహాయ విస్తరణ సంచాలకులు డాక్టర్ చంద్రశేఖర్ ప్రారంభించారు. అనంతరం పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయణతో కలిసి ఆయన మాట్లాడారు. రైతులకు కృషి విజ్ఞాన కేంద్రం అందిస్తున్న సేవలను వినియోగించుకోవాలని సూచించారు. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన వంగడాలను రైతులు పండించుకోవాలని సూచించారు. ఖమ్మం నాబార్డ్ డీడీఎం సుజీత్‌కుమార్ మాట్లాడుతూ.. నాబార్డ్ ద్వారా అందిస్తున్న పథకాల గురించి వివరించారు. కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ భరత్ మాట్లాడుతూ.. రైతులు చేస్తున్న కృషిని గుర్తించి వారిని సన్మానించాలనే ఉద్దేశంతో జిల్లాలో ఉన్న 40 మంది అభ్యుదయ రైతులను సత్కరించామని తెలిపారు. మణుగూరు సహాయ వ్యవసాయ సంచాలకులు తాతారావు మాట్లాడుతూ.. రైతులు కొత్త పద్ధతులు పాటిస్తూ ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు శరత్, శివ తదితరులు పాల్గొన్నారు.
కేవీకే కిసాన్ మేళాలో వక్తలు


