ప్రమాణంలో పదనిసలు
పాల్వంచరూరల్: పలు గ్రామ పంచాయతీలకు పక్కాభవనాలు లేని కారణంగా నూతన పాలకవర్గ స్వీకారమహోత్సవం పాఠశాల ప్రాంగణంలో, అద్దెభవనాల్లో నిర్వహించారు. దంతలబోరు ఎస్సీకాలనీ పంచాయతీలో స్కూల్ ప్రాంగణంలో, రెడ్డిగూడెంలో స్కూల్ వద్ద, నాగారం కాలనీ పంచాయతీ పాలకవర్గం అంగన్‌వాడీ కేంద్రం వద్ద ప్రమాణస్వీకారం చేశారు. నాగారంలో టెంట్ సరిపోకపోవడంతో పాలకవర్గ సభ్యులు, కార్యక్రమానికి వచ్చిన గ్రామస్తులు ఎండలో కూర్చువాల్సి వచ్చింది. కనీసం తాగునీరు సౌకర్యం కూడా కల్పించలేదు. కాగా దంతలబోరు ఎస్సీకాలనీ సర్పంచ్ సోడే వెంకటరమణ తన కుమారుడిని ఒడిలో కూర్చొబెట్టుకుని ప్రమాణస్వీకారం చేశారు.
గ్రామపంచాయతీ నూతన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులు జిల్లావ్యాప్తంగా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. పలుచోట్ల దంపతులు, అన్నాచెల్లెళ్లు, బంధువులు ఒకే పాలకవర్గంలో కొలువుదీరారు. కొన్ని గ్రామాల్లో పంచాయతీలకు కార్యాలయాలు లేకపోవడంతో ప్రమాణ స్వీకార మహోత్సవానికి అవస్థలు ఎదురయ్యాయి. పాఠశాల, అంగన్‌వాడీ ప్రాంగణాల్లో, ఎండలోనే కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంతో పాలకవర్గ సభ్యులతోపాటు హాజరైన ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు.
అశ్వారావుపేటరూరల్: అశ్వారావుపేట మండలం నారాయణపురం గ్రామపంచాయతీ సర్పంచ్‌గా మడకం కుమారి, ఇదే పంచాయతీ 4వ వార్డు నుంచి ఆమె భర్త మడకం వీర్రాజు(ఆండ్రయ్య) గెలుపొందారు. వీరిద్దరు సోమవారం ఒకే వేదికపై ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటు 1, 2, 9, 10వ వార్డుసభ్యులు సోయం ప్రసాద్, కుంజా స్వర్ణ, కుంజా రాంబాబు, పాయం జగధాంబ స్వగ్రామం నెమలిపేట కావడం విశేషం. ఇందులోనూ రాంబాబు, స్వర్ణ దంపతులు కావడంతో ఒకే పంచాయతీ పాలకవర్గంలో రెండు జంటలు ఉన్నట్లయింది.
ఇల్లెందురూరల్: మండలంలోని బొజ్జాయిగూడెం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్‌గా ఆరెం ప్రియాంక సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. ఉపసర్పంచ్‌గా ఆమె పెదనాన్న కుమారుడు అరెం కిరణ్ బాధ్యతలు స్వీకరించారు. పదవులలో అన్నా, చెల్లెలు కొలువుదీరడంతో ఆ కుటుంబంలో ఆనందం నెలకొంది.
ప్రమాణంలో పదనిసలు
ప్రమాణంలో పదనిసలు
ప్రమాణంలో పదనిసలు


