పూరిల్లు దగ్ధం
అశ్వాపురం: మండల పరిధిలోని చింతిర్యాల కాలనీలో సోమవారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో దామెర్ల రాజా పూరి ల్లు దగ్ధమైంది. అర్ధరాత్రి దాటాక ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం జరిగి మంటలు వ్యాపించాయి. దీంతో ఇంట్లో నిద్రిస్తున్న కుటంబ సభ్యులు మేల్కొని బయటకు రాగా, పూరిల్లు పూర్తిగా దగ్ధమైంది. ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తుండగా ఇటీవల బిల్లు మంజూరు కావడంతో ఇంట్లో బీరువాలో ఉన్న సుమారు రూ. లక్ష నగదు, సామాన్లు, బట్టలు పూర్తిగా కాలిపోయాయి. కాగా బాధిత కుటుంబానికి దోసపాటి రంగారావు చారిటబుల్ ట్రస్ట్, శివకామేశ్వరి గ్రూప్స్ డైరెక్టర్ దోసపాటి పిచ్చేశ్వరరావు బట్టలు, గిన్నెలు, నిత్యావసర వస్తువులు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొర్సా అలివేలు, ఉపసర్పంచ్ ఎన్నా అశోక్‌కుమార్, మాజీ జెడ్పీ కో ఆప్షన్ సభ్యుడు షర్పియుద్దిన్, కొర్లకుంట రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
వ్యక్తి ఆత్మహత్య
ఇల్లెందురూరల్: మండలంలోని మామిడిగూడెం గ్రామపంచాయతీ చింతలబోడు గ్రామానికి చెందిన బిజ్జ కనకరాజు (35) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టభద్రుడైన కనకరాజు వార్డెన్ ఉద్యోగం కోసం పరీక్ష రాసేందుకు సన్నద్ధమై ఈ నెల 20న ఇంటి నుంచి బయలుదేరి గ్రామశివారులోని అడవిలో పురుగుల మందు తాగాడు. అటుగా వెళ్లిన గ్రామస్తులు కనకరాజును గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి భార్య కృష్ణవేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సీఐ సురేష్ సోమవారం తెలిపారు.
మద్యం తాగొద్దన్నందుకు..
సత్తుపల్లిరూరల్: మద్యానికి బానిసైన ఓ వ్యక్తిని కుటుంబ సభ్యులు మందలించడంతో ఉరి వేసుకుని ఆత్మహ త్య చేసుకున్నాడు. సత్తుపల్లి మండలం సిద్ధారం గ్రామానికి చెందిన వాసం ఆదినారాయణ(55) ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ తరచూ మద్యం సేవించేవాడు. మద్యం అలవాటుతో డబ్బు వృథా చేస్తున్నావని కుటుంబ సభ్యులు మందలించటంతో సోమవారం ఉదయం భార్య నిర్మల, కొడుకు వెంకటప్పయ్య కూలి పనులకు వెళ్లాక గది తలుపులు పెట్టుకుని ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. ఇంటికి వచ్చాక కుటుంబీకులు ఈ విషయాన్ని గుర్తించారు. ఘటనపై ఆదినారాయణ భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
చెల్లని చెక్కు కేసులో ఏడాది జైలుశిక్ష
ఖమ్మం లీగల్: అప్పు చెల్లించే క్రమాన ఇచ్చిన చెక్కు చెల్లకపోవడంతో ఓ మహిళకు ఏడాది జైలుశిక్ష విధిస్తూ ఖమ్మం రెండో అదనపు ప్రథమ శ్రేణి కోర్టు న్యాయాధికారి ఏపూరి బిందుప్రియ సోమవారం తీర్పు చెప్పారు. భద్రాద్రి జిల్లా బూర్గంపాడుకు చెందిన మంగిపుడి నాగమణి వద్ద అదే గ్రామానికి చెందిన బార్ల రత్నకుమారి 2020 మే నెలలో రూ.5లక్షల అప్పు తీసుకుంది. తిరిగి 2021 సెప్టెంబర్‌లో చెక్కు జారీ చేసినా ఆమె ఖాతాలో సరిపడా నగదు లేక తిరస్కరణకు గురైంది. దీంతో నాగమణి తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీస్ జారీ చేసి కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేసింది. విచారణ అనంతరం రత్నకుమారికి జైలుశిక్ష విధించడమే కాక ఫిర్యాదికి రూ.5లక్షలు చెల్లంచాలని న్యాయాధికారి తీర్పు చెప్పారు.


