‘ఫిట్‌నెస్’ తూచ్..!
40 రోజుల్లో మూడు ప్రమాదాలు
విధుల్లో శిక్షణ లేని సిబ్బంది
పట్టించుకోని ఉన్నతాధికారులు
రుద్రంపూర్: కొత్తగూడెం ఏరియా పరిధిలోని వీకే–7 ఓసీలో నడుస్తున్న వోల్వోలు ఫిట్‌నెస్ లేని కారణంగా గడిచిన 40 రోజుల్లో మూడు ప్రమాదాలు జరిగాయి. క్వారీలో పనిచేసే ఉద్యోగులు, ఇతర సిబ్బంది సెల్‌ఫోన్‌లు వాడదరాలని, ఫలితంగా ప్రమాదాలు జరుగుతున్నాయని సంస్థ ఉన్నతాధికారులు కిందిస్థాయి అధికారులు, ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసినా.. పట్టించుకోకపోవడంతో ప్రమాదాలకు నిలయంగా మారింది. అంతేకాక ఉద్యోగులకు సరైన శిక్షణ (ఎంవీటీసీ) కూడా లేదని, దీనికి తోడు క్వారీలో పనిచేస్తున్న సిబ్బంది నిర్లక్ష్యంతో ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మికలు వాపోతున్నారు. సంస్థలో పనిచేసే ఉద్యోగులకు ఎంవీటీసీతో పాటు ఇతర అన్ని రకాలు శిక్షణలు ముగిసిన తరువాతే క్వారీలో పనుల్లోకి వెళ్లాల్సి ఉండగా.. వీకే–ఓసీలో మాత్రం ఇందుకు విరుద్ధంగా జరుగుతున్నా.. ఉన్నతాధికారులు స్పందించకపోవడం గమనార్హం.
గతంలో ఎన్నడూ లేని ఒరవడి..
ఇదిలా ఉండగా, గతంలో ఇక్కడ ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా పనిచేసే అధికారి ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఏ పనైనా జరిగేది. ఆయన ప్రతీ అంశాన్ని ప్రశ్నిస్తున్నారని చెప్పి ఇక్కడి నుంచి బదిలీ చేయించారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని నూతన ఒరవడి ఏరియాలో వినిపించడంతో కార్మికులను విస్మయానికి గురిచేస్తోంది.
సింగరేణి సంస్థలో ఒక ఉద్యోగి విధుల్లో చేరాలంటే ఎంవీటీసీతో పాటు వాహనాలు నడిపే వ్యక్తికి శిక్షణ అందుకు సంబంధించిన సర్టిఫికెట్లు అవసరం. కానీ కొత్తగా ఏర్పాటవుతున్న ఓసీలో శిక్షణలేని డ్రైవర్లు పనిచేయడంతో ఇటీవల మూడు ప్రమాదాలు జరిగాయి. క్వారీలో నడిచే వాహనాలకు బ్రేక్‌లు ఫెయిల్ అవడం విడ్డూరంగా ఉంది. ఏరియా సేఫ్టీ అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు.
– ఆంజనేయులు, హెచ్‌ఎంఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు
ఏంటికి ఏమి కాకముందే ఇన్ని ప్రమాదాలు జరిగితే మరో 25 ఏళ్లు నడిచే ఓసీలో మరెన్ని ప్రమాదాలు సంభవిస్తాయోనని కార్మికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు రక్షణ వారోత్సవాలు జరిగిన మూడు రోజులకే ప్రమాదం జరగడం విస్మయానికి గురి చేస్తోంది. ఈ క్రమంలో సేఫ్టీ కమిటీ ఏ విచారణ చేశారో అర్థం కానీ అంశం. జరిగిన ప్రమాదం మరోమారు జరగకుండా చూడాల్సిన అధికారులే తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడంపై కార్మికుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా కార్పొరేట్ సేఫ్టీ, ఏరియా ఉన్నతాధికారులు స్పందించి మరోమారు ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు.
వీకే–7 ఓసీలో
ఫిట్‌నెస్‌లేని వోల్వోలు
‘ఫిట్‌నెస్’ తూచ్..!


