హత్య కేసులో తొమ్మిది మంది అరెస్ట్..
● వివరాలు వెల్లడించిన ఏఎస్పీ విక్రాంత్‌కుమార్‌సింగ్
భద్రాచలంటౌన్: పట్టణంలో సంచలనం సృష్టించిన సజ్జ రవి హత్య కేసులో ప్రధాన నిందితులతో సహా తొమ్మిది మందిని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్‌కుమార్‌సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 17వ తేదీ సాయంత్రం చర్ల రోడ్డులోని ఓ వైన్స్ సమీపాన సజ్జ రవి దారుణ హత్యకు గురయ్యాడు. దీంతో పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో ప్రధాన నిందితులు పంగి శివ, బోయిన దుర్గా ప్రసాద్, జలకం నాగరాజులతో పాటు బొడ్డు అఖిల్, లంకపల్లి వెంకటేష్, ముత్యాల జయరాం, రిక్క వీర శివశంకర్‌రెడ్డి, కాపుల శివ, కాపుల కృష్ణ ఉన్నారు. భద్రాచలం పరిసర ప్రాంతాలకు చెందిన నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని, పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఏఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ సీఐ ఎం.నాగరాజు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.


