ప్రమాదాల నివారణకు పక్షోత్సవాలు
రుద్రంపూర్: జీరో ప్రమాదాల సింగరేణిగా నిలిపేందుకు సంస్థవ్యాప్తంగా ఉన్న 11 ఏరియాల్లో ఈ నెల 8వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రక్షణ పక్షోత్సవాలు నిర్వహించామని సింగరేణి డైరెక్టర్ (ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్) కె. వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా 21 భూగర్భ గనులు, 16 ఓపెన్‌కాస్ట్ గనులు, తాడిచెర్ల గనిని మూడు గ్రూపులుగా విడదీసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని పేర్కొన్నారు. 11 సీహెచ్‌పీలు, 11 వర్క్‌షాపులు, నాలుగు 132 కేవీ/33కేవీ సబ్‌స్టేషన్లు, 11 సోలార్ ప్లాంట్లు, 10 ఎంవీటీసీలు, 12 ఆస్పత్రులతోపాటు ఎక్స్‌ప్లోరేషన్ వర్క్‌షాపుల్లో ప్రత్యేక బృందాలతో తనిఖీ చేశామని అన్నారు. బృందాలు ఆయా ఏరియాల్లో లోపాలను గుర్తించి, నష్టాలను వివరించి, రక్షణ పక్షోత్సవాలు జరిపారని చెప్పారు. లోపాలులేని గనులకు, జాగ్రత్తలు పాటిస్తున్న సిబ్బందికి మెమెంటోలు అందిచామని తెలిపారు. గనుల వద్ద అప్రమత్తంగా ఉండాలంటూ నాటికలు, ఆట, పాట రూపంలో అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. ఉద్యోగులు, కార్మికులు, అధికారులు రక్షణ సూత్రాలు పాటిస్తూ ఉత్పతి, ఉత్పాదకతను పెంచాలని సూచించారు.
సింగరేణి డైరెక్టర్ వెంకటేశ్వర్లు


