ట్రాన్స్‌ఫార్మర్ మీద పడిన యువకుడు మృతి
భద్రాచలంఅర్బన్: ప్రమాదశాత్తు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ మీదపడి ఓ యువకుడు మృతిచెందిన ఘటన పట్టణంలో శుక్రవారం చోటుచేసుకుంది. ములుగు జిల్లా వాజేడు మండలం, జగన్నాథపురం గ్రామానికి చెందిన వంశీ (23) సామ్రాట్ లాడ్జి పక్కన గదిలో ఉంటున్నా డు. పనిమీద బయటకు రాగా లాడ్జికి చెందిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ యువకుడిపై పడటంతో మృతిచెందాడు. స్థానికులు సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. కాగా, పలువురు రాజకీయ నాయకులు, పలు కుల సంఘాల నాయకులు సదరు లాడ్జి ఎదుట వంశీ మృతదేహంతో ఆందోళన చేపట్టారు. పోలీసులు అక్కడికి చేరుకోగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. గొడవ సద్దుమణిగాక వంశీ మృతదేహాన్ని ఏరి యా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ప్రమాదవశాత్తు వంశీ మృతి చెందినట్లు అతని కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
విద్యుదాఘాతంతో వివాహిత..
అశ్వారావుపేటరూరల్: విద్యుదాఘాతానికి గురై ఓ వివాహిత మృతి చెందిన ఘటన మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ యయాతి రాజు, కుటుంబీకుల కథనం ప్రకారం.. మండలంలోని వినాయకపురం కాలనీలో వేల్పుల కిశోర్, రూప (25)తోపాటు మూడేళ్ల బాలుడు, ఏడాది వయస్సు ఉన్న కుమార్తె ఉంటున్నా రు. మధ్యాహ్నం సమయంలో కుమార్తెను పడుకోబెట్టి.. తడి బట్టలను ఇంటి ముందు ఉన్న రేకుల షెడ్డుకు కట్టిన దండెం (ఐరన్ తీగ)పై ఆరేస్తున్న క్రమంలో విద్యుదాఘాతానికి గురైంది. చేతికి గాయాలు కాగా, అపస్మారకస్థితిలోకి వెళ్లడంతో కుటుంబీకులు ఆటోలో అశ్వారావుపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యు లు మధ్యలోనే మృతిచెందిందని, పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి భర్త కిశోర్ ఫిర్యాదుతో మృతదేహానికి పోస్టుమార్టం జరిపించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. కాగా, సర్వీస్ వైరు ఐరన్ రేకుల రాపిడికి గురి కావడంతో విద్యుత్ సరఫరా అయిందని పోలీసులు తెలిపారు.
కాల్వలో పడి వ్యక్తి..
అశ్వాపురం: మండలంలోని చింతిర్యాలగూడెం గ్రామంలో రహదారి వెంబడి మురుగు కాలువలో పడి శుక్రవారం ఓ వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన పాయం కామరాజు (32) కొంతకాలంగా మతిస్థిమితం లేకుండా తిరుగుతూ.. ఇంట్లోంచి బయటకు వచ్చాడు. రహదారి వెంబడి మురుగుకాలువలో పడి మృతి చెందాడు. ఎస్‌ఐ మధుప్రసాద్ ఘటనా స్థలాన్ని సందర్శించి మృతదేహాన్ని మణుగూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ట్రాన్స్‌ఫార్మర్ మీద పడిన యువకుడు మృతి


