వర్షానికి తడిసిన ధాన్యం
సుజాతనగర్: మండలంలో శుక్రవారం తెల్లవారు జామున కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రంలోని ధాన్యం తడిసింది. వారం రోజుల కింద కురిసిన వర్షానికి నష్టపోయిన రైతులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో ప్రకృతి మరోసారి కన్నెర్ర చేసింది. రాత్రి సమయంలో వర్షం కురవడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించక పోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని, తూకంలో ఆలస్యం జరుగుతోందని వాపోతున్నారు. తూకం వేసిన ధాన్యం బస్తాలు 4 వేల వరకు ఉండగా..1500 మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రస్తుతం కొనుగోలు కేంద్రంలో ఉంది. అధికారులు స్పందించి త్వరగా ధాన్యం తూకం వేసి మిల్లులకు తరలించాలని కోరుతున్నారు.
పాల్వంచలో..
పాల్వంచరూరల్: మండలంలోని కారెగట్టు ధాన్యం కొనుగోలు కేంద్రంలో గురువారం రాత్రి కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసిందని, వర్షం కురిసినప్పుడల్లా ధాన్యం ఆరబెట్టుకోవాల్సి వస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు కేవలం రెండు లోడ్ల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారని రైతులు చెబుతున్నారు. కాగా, మిల్లర్లు కొనుగోలు చేయడం లేదని, లారీలు రాకపోవడంతో కొనుగోలులో జాప్యం జరుగుతోందని నిర్వాహకులు రవి తెలిపారు.
వర్షానికి తడిసిన ధాన్యం


