విలువైన రాయి.. తరలిపోయి..
● ‘సీతారామ’ రాళ్ల తరలింపు.. ● పట్టించుకోని అధికారులు
ములకలపల్లి: సీతారామ ఎత్తిపోతల పథకం (ఎస్‌ఆర్‌ఎల్‌ఐపీ) ప్రధాన కాల్వ తవ్వకంలో బయటపడిన పెద్ద రాళ్లు (హార్డ్ రాక్) మాయమవుతున్నాయి. క్రషింగ్‌కు అనుగుణంగా ఉన్న విలువైన రాళ్లను భారీ వాహనాలతో ముక్కలుగా పగులగొట్టి టిప్పర్లలో బయటకు తరలిస్తున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలంలోని కొత్తూరు శివారులోని సీతారామ ప్రధాన కాల్వపై వంతెన నిర్మించారు. ఈ ప్రదేశంలో కాల్వ తవ్వే సమయంలో క్రషర్‌లో వినియోగించేందుకు అనువైన గట్టి రాయి బయటపడింది. కాల్వ నిర్మాణం కోసం రాయిని బయట వేశారు. అయితే, పట్టపగలే భారీ జేసీబీ సాయంతో రాయిని వెలికితీసి, ముక్కలుగా మార్చి, టిప్పర్లలో తరలిస్తున్నారు. యథేచ్ఛగా సాగుతున్న ఈ దందాతో విలువైన రాళ్లగుట్ట క్రమేపీ కరిగిపోతోంది. సంబంధితశాఖ అధికారులు దృష్టిసారించి రాయిని కాపాడాలని పలువురు కోరుతున్నారు. కాగా, ఈ ఘటనలపై ఇరిగేషన్ శాఖ ఏఈ నరేశ్‌ను వివరణ కోరగా.. కాల్వ ఒడ్డున ఉన్న రాళ్లను క్రషింగ్ చేసి, తిరిగి సీతారామ ప్రాజెక్ట్ పనులకే వినియోగిస్తామని తెలిపారు. ఎంత రాయి తరలిస్తే, అంతమేరకు మార్కెట్ రేటుకు అనుగుణంగా రివకరీ చేస్తామని చెప్పారు.


