తిరోగమన విధానాలతో ప్రజా వ్యతిరేకత
● అందాల పోటీలతో కాంగ్రెస్ పరువు గంగపాలైంది ● బీఆర్‌ఎస్ నాయకుడు రాకేష్‌రెడ్డి
సూపర్‌బజార్(కొత్తగూడెం): అందాల పోటీలను ఆర్భాటంగా నిర్వహిస్తున్న కాంగ్రెస్ పరువు గంగ పాలైందని బీఆర్‌ఎస్ నాయకుడు ఏనుగుల రాకేష్‌రెడి అన్నారు. కొత్తగూడెంలోని బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తిరోగమన విధానాలు అవలంబిస్తూ ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారని విమర్శించారు. అందాల పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన విదేశీ మహిళల కాళ్లను ఓరుగల్లు ఆడబిడ్డలతో కడిగించారని ఆరోపించారు. ఇందిరాగాంధీ, సోనియా అమ్మలైతే కాళ్లు కడిగిన ఆడబిడ్డలు ఎవరని ప్రశ్నించారు. పోటీలకు వచ్చిన వారిని అతిథులుగా చూడాలే తప్ప దేవకన్యలుగా కాదన్నారు. ఇది రాణి రుద్రమ, చాకలి ఐలమ్మ, సమ్మక్క, సారక్క నడయాడిన నేలని, ప్రతీ ఆడబిడ్డలో ఆ పౌరుషం, తెగింపు ఉంటాయని అన్నారు. కాళ్లుకడిగిన ఆడపడుచుల కాళ్లను రేవంతరెడ్డి కడిగి ఆ నీటిని నెత్తిన చల్లుకోవాలని సూచించారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలుచేయడం లేదని ధ్వజమెత్తారు. సింగరేణి కార్మికులను కేసీఆర్ కడుపులో పెట్టుకుని చూసుకున్నారని, ప్రతి కార్మికుడికి 250 గజాల స్థలం ఇస్తామన్న కాంగ్రెస్ వాగ్దానం నేటికీ అమలు కాలేదని అన్నారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి, మాజీ ఎంపీపీ బాదావత్ శాంతి, నాయకులు తొగరు రాజశేఖర్, సింధూ తపస్వి, ప్రసాద్, పురుషోత్తం, మురళి తదితరులు పాల్గొన్నారు.


