ఎస్పీ బి.ఉమామహేశ్వర్
బాపట్లటౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అర్జీలు పునరావృతమైతే చర్యలు తప్పవని ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి అర్జీదారులు హాజరై తమ సమస్యలను ఎస్పీకి వివరించారు. బాధితుల సమస్యలు తెలుసుకున్న ఎస్పీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లాలోని పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అర్జీదారుల సమస్యలను చట్ట పరిధిలో విచారించి నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలన్నారు. వివిధ సమస్యలతో పోలీస్ కార్యాలయాలకు వచ్చే బాధితులకు భరోసాగా పోలీస్ శాఖ ఉండాలన్నారు. అర్జీలను పూర్తి స్థాయిలో విచారించి శాశ్వతంగా పరిష్కారం చూపాలన్నారు. పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో అధికంగా కుటుంబ కలహాలు, అత్తింటి వేధింపులు, ఆస్తి తగాదాలు, భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీ మోసాలకు సంబందించిన అర్జీలే అధికంగా వస్తున్నాయని పోలీసు అధికారులు ఎస్పీకు వివరించారు. కార్యక్రమంలో బాపట్ల సీసీఎస్ డీఎస్పీ పి. జగదీష్‌నాయక్, పీజీఆర్‌ఎస్ సెల్ ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాసరావు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఉద్యోగంతోపాటు క్రీడల్లోనూ రాణించాలి
ఉద్యోగంతో పాటు క్రీడల్లోనూ రాణించాలని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. 11వ ఆల్ ఇండియా పోలీస్ జూడో క్లస్టర్ 2026 పోటీల్లో ప్రత్యేక ప్రతిభ కనపరిచి కాంస్య పతకం సాధించిన మహిళా కానిస్టేబుల్ నాగమణిను సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఎస్పీ మాట్లాడుతూ వెదుళ్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న నాగవాణి హైదరాబాద్‌లోని గచ్చిబౌలి జి.ఎమ్.సి.బి ఇండోర్ స్టేడియంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఆధ్వర్యంలో 11వ ఆల్ ఇండియా పోలీస్ జూడో క్లస్టర్–2026 పోటీలు నిర్వహించారు. జూలై 23 నుంచి 30 వరకు నిర్వహించిన ’పెన్చాక్ సిలాట్’ క్రీడలోని ’మహిళల –100 కేజీల’ విభాగంలో నాగవాణి సత్తా చాటి కాంస్య పతకం సాధించింది. ఈమె గతంలో కూడా అల్ ఇండియా పోలీస్ మీట్‌లలో పాల్గొని బాక్సింగ్ విభాగంలో రెండు కాంస్య పతకాలు సాధించడం అభినందనీయమన్నారు. భవిష్యత్‌లో ఆమె మరిన్ని జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించి జిల్లాపోలీస్ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింప చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అడ్మిన్ ఆర్.ఐ మౌలుద్దీన్, ఇతర పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.


