ఏపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ తేలప్రోలు శ్రీనివాసరావు
రేపల్లె: పదవ తరగతి పబ్లిక్ పరీక్షల మూల్యాంకనం పూర్తయి నాలుగు నెలలు గడిచినా ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన రెమ్యూనరేషన్ ఇప్పటికీ బకాయిగా ఉండటం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఏపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ తేలప్రోలు శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం రోజులు, రాత్రులు తేడా లేకుండా కష్టపడి మూల్యాంకనం నిర్వహించిన ఉపాధ్యాయులను ప్రభుత్వం పూర్తిగా విస్మరించడం శోచనీయమన్నారు. జిల్లాలో నిర్వహించిన పదవ తరగతి మూల్యాంకన కార్యక్రమంలో సుమారు 2,600 మంది ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొని బాధ్యతాయుతంగా తమ విధులను నిర్వర్తించినప్పటికీ, వారికి రావాల్సిన పారితోషికాన్ని ఇప్పటికీ విడుదల చేయకపోవడం దారుణమని పేర్కొన్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయుల పట్ల చూపుతున్న ఈ నిర్లక్ష్యం అసహనానికి గురిచేస్తోందని, వెంటనే బకాయిలు చెల్లించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టేందుకు ఏపీటీఫ్ సిద్ధంగా ఉందని హెచ్చరించారు. ఉపాధ్యాయుల శ్రమను గౌరవిస్తూ, వారికి రావాల్సిన ప్రతి రూపాయిని ఆలస్యం లేకుండా చెల్లించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి, పదవ తరగతి మూల్యాంకనానికి సంబంధించిన రెమ్యూనరేషన్‌న్‌ను వెంటనే విడుదల చేసి ఉపాధ్యాయుల ఆవేదనను నివారించాలని డిమాండ్ చేశారు.
శాకంబరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చిన లలిత పరబ్రహ్మేశ్వరి అమ్మవారు
రేపల్లె: ఆషాఢమాసం బహుళ త్రయోదశిని పురస్కరించుకుని మండలంలోని కారుమూరు గ్రామంలో వేంచేసియున్న లలితా పరబ్రహ్మేశ్వరి సమేత అమరలింగేశ్వరస్వామి ఆలయంలో ఆలయ అర్చకుడు నందివెలుగు రవికుమార్ ఆధ్వర్యంలో సోమవారం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమరేశ్వరస్వామి, లలిత పరబ్రహ్మేశ్వరి అమ్మవార్లతోపాటు నందీశ్వరునికి పంచామృతాలు, పండ్ల రసాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. స్వామివారికి, నందీశ్వరునికి ఏకకాల హారతులిచ్చారు. అమ్మవారిని కూరగాయలతో శాకంబరీదేవిగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని, అమ్మవారిని, నందీశ్వరుని దర్శించుకుని మొక్కుబడులు తీర్చుకున్నారు. నిర్వాహకులు భక్తులకు తీర్ధప్రసాదాలు పంపిణీ చేశారు.
రూ.11.80 లక్షల అపరాధ రుసుం విధింపు
కొరిటెపాడు(గుంటూరు): విద్యుత్ చౌర్యం, అక్రమ విద్యుత్ వినియోగాన్ని అరికట్టేందుకు విద్యుత్ శాఖ విజిలెన్స్, ఆపరేషన్ విభాగాలు గుంటూరు పర్యవేక్షక ఇంజినీర్ చల్లా రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో భారీగా అక్రమాలు వెలుగుచూశాయి. గుంటూరు నగరంలోని ఆర్‌టీసీ బస్టాండ్, పాతగుంటూరు, బాలాజీనగర్, సుద్దపల్లి డొంక, ప్రగతినగర్‌లలో సోమవారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 52 మంది అధికారులు, 156 మంది సిబ్బంది, 52 బృందాలుగా ఏర్పడి 4,069 సర్వీసులను తనిఖీ చేశారు. అనుమతించిన లోడు కంటే అదనంగా విద్యుత్ వాడుతున్న 243 మందికి రూ.11.72 లక్షలు, అనుమతించిన కేటగిరీకి కాకుండా ఇతర కేటగిరిలో విద్యుత్ వాడుకుంటన్న ఒక్కరికి రూ.8 వేలు మొత్తం కలిపి రూ.11.80 లక్షలు అపరాధ రుసుం విధించినట్లు అధికారులు తెలిపారు. గుంటూరు పర్యవేక్షక ఇంజినీర్ చల్లా రమేష్ మాట్లాడుతూ విద్యుత్‌ను అక్రమంగా వినియోగించడం వల్ల ప్రభుత్వానికి ఆదాయ నష్టం కలగడమే కాకుండా విద్యుత్ వ్యవస్థపై అదనపు భారం పడుతుందని తెలిపారు. వినియోగదారులు నిబంధనలకు అనుగుణంగా విద్యుత్ సర్వీసులను వినియోగించాలని సూచించారు. అక్రమ విద్యుత్ వినియోగానికి పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యుత్ చౌర్యం, అక్రమ విద్యుత్ వినియోగానికి సంబంధించిన సమాచారం ఉంటే 9440812263, 9440812361 నంబర్లకు ఫోన్ చేయవచ్చని, వాట్సాప్ ద్వారా కూడా సమాచారాన్ని అందించవచ్చని పేర్కొన్నారు. తనిఖీల్లో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సీహెచ్ వెంకటేశ్వరరావు, విజిలెన్స్, ఆపరేషన్ విభాగాల డీఈఈలు పి.రమేష్, ఎన్.మల్లికార్జునప్రసాద్, కె.రవికుమార్, ఏఈలు షేక్ మస్తాన్, యు.ఉమాశంకర్, ఎం.సతీష్‌కుమార్ పాల్గొన్నారు.
తెనాలిరూరల్: పట్టణ చినరావూరుకు చెందిన యువతి తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో చికిత్సకు చేరగా, నిజాంపట్నంలో చెరువులకు కాపలా ఉంటున్న దుర్గ, ఆమె భర్త చిన్నారావు యువతిని తమ వెంట తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. చిన్నారావు మహిళపై లైంగికదాడికి పాల్పడిన సంగతి విదితమే. త్రీ టౌన్ పోలీసులు కిడ్నాప్, రేప్, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాల కింద కేసును ఆదివారం రాత్రి నమోదు చేశారు. అప్పటికే ఈ కేసులో నిందితులైన దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుర్గ ఏడు నెలల గర్భవతి కావడంతో తనకు నొప్పులు వస్తున్నాయని పోలీసులకు ఆదివారం రాత్రి చెప్పడంతో వైద్యశాలకు పంపగా, పరీక్షించిన వైద్యులు ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పడంతో పోలీసులు తిరిగి తమ అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. బాధిత యువతికి వైద్య పరీక్షలు నిర్వహించారు.


