గుంటూరు మెడికల్: తమ డిమాండ్‌లు పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (జూడా) ఆధ్వర్యంలో సోమవారం గుంటూరు జీజీహెచ్‌లో హౌస్ సర్జన్లు, పీజీలు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలందిస్తున్న జూనియర్ డాక్టర్లకు స్టయిఫండ్ సవరణ తక్షణమే చేయాలన్నారు. పలుమార్లు వినతి పత్రాలు సమర్పించినా సంబంధిత అధికారులతో సమావేశాలు నిర్వహించినా హామీలు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఉత్తర్వులు వెలువడలేదన్నారు. అత్యవసర సేవలు, అవుట్ పేషెంట్, ఇన్‌పేషెంట్, ఐసీయూ, ఆపరేషన్ థియేటర్లు, ప్రసూతి సేవలు, బోధన, తదితర కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న జూనియర్ డాక్టర్ల న్యాయమైన డిమాండ్ ఇప్పటికీ పెండింగ్‌లో ఉండటం తమను తీవ్ర నిరాశకు గురిచేస్తుందని నేతలు తెలిపారు. ప్రజలకు వైద్య సేవలకు అంతరాయం కలుగకూడదనే ఉద్దేశ్యంతో తాము ఇప్పటి వరకు వేచి ఉన్నామన్నారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్‌లను పరిష్కరించేందుకు చొరవ చూపించడం లేదని, అందువల్లే మంగళవారం నుంచి సమ్మె చేస్తున్నట్లు జూడా సంఘం నేతలు మీడియాకు వెల్లడించారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. స్టయిఫండ్ సవరణను అమలు చేస్తూ సంతకం చేసిన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని, లేదా ప్రభుత్వ ఉత్తర్వు ఎప్పుడు జారీ చేస్తారో లిఖిత పూర్వకంగా సంబంధిత అధికారులు తెలియజేయాలన్నారు. జూనియర్ డాక్టర్ల ఉద్యమం కేవలం స్టయిఫండ్ పెంపు కోసమే కాదని, జూనియర్ డాక్టర్ల గౌరవం, ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు, ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను నిలబెట్టే వైద్యుల హక్కుల పరిరక్షణ కోసం చేపట్టిన న్యాయమైన పోరాటమని వెల్లడించారు.
జూడా సంఘం నేతలతో చర్చలు
సోమవారం గుంటూరు జీజీహెచ్‌లో జూనియర్ డాక్టర్లు నల్లబ్యాడ్జిలతో విధులకు హాజరవడంతో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ గిరిజవోలు దుర్గాప్రసాద్ జూడా సంఘం నేతలతో సమావేశమయ్యారు. రోగులకు ఇబ్బంది లేకుండా విధులకు హాజరు కావాలని చెప్పారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే వరకు యూనియన్ రాష్ట్ర శాఖ చెప్పేంత వరకు తాము విధులకు హాజరు కామని జూడా సంఘం నేతలు స్పష్టం చేశారు. రాష్ట్ర సంఘం ఆదేశాల మేరకు మంగళవారం నుంచి సమ్మె చేస్తున్నామని వెల్లడించారు. కేవలం ఎమర్జెన్సీ వైద్య సేవలు, ఐసీయూ, కాన్పుల విభాగం విధులకు మాత్రమే హాజరవుతామని జూడా సంఘం నేతలు స్పష్టం చేశారు.
నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరు


