పంట పొలాల్లోకి దూసుకెళ్లిన కారు | - | Sakshi
Sakshi News home page

పంట పొలాల్లోకి దూసుకెళ్లిన కారు

Aug 9 2026 2:22 AM | Updated on Aug 9 2026 2:22 AM

నాదెండ్ల: వేగంగా వెళ్తున్న కారు ద్విచక్రవాహనాన్ని తప్పించే క్రమంలో అదుపుతప్పి పంటపొలాల్లోకి దూసుకెళ్లిన సంఘటన సాతులూరు పెట్రోల్‌ బంకు సమీపంలో శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. నరసరావుపేట నుంచి గుంటూరు వైపు వెళ్తున్న కారు సాతులూరు పరిధిలో ప్రయాణిస్తున్న సమయంలో ఓ ద్విచక్ర వాహనం అడ్డుగా వచ్చింది. దీంతో ఒక్కసారిగా బ్రేక్‌ వేయటంతో కారు టైరు పగిలి అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. స్థానికులు గమనించి కారులోని వారిని బయటకు తీశారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవటంతో ఊపిరి పీల్చుకున్నారు. కారు నెంబరు ప్లేట్‌పై పోలీస్‌ స్టిక్కర్‌ ఉండటంతో ప్రయాణికులు ఎవరనేది తెలియాల్సి ఉంది. సంఘటనపై పోలీసులకు ఎలాంటి సమాచారం

అందలేదు.

ఫిజియోథెరపీ డాక్టర్‌పై దాడి

–ఆర్థిక వివాదమే కారణం

నరసరావుపేట టౌన్‌: ఆర్థిక వివాద నేపథ్యంలో ఫిజియోథెరపీ డాక్టర్‌పై రాడ్డుతో దాడికి పాల్పడిన సంఘటనపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్‌ సీఐ షేక్‌ ఫిరోజ్‌ శనివారం తెలిపారు. పట్టణానికి చెందిన జాజం దీపక్‌ ఫిజియోథెరపీ డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. అన్నపరెడ్డి మంగయ్య ద్వారా ఎల్టీనగర్‌లో ఇల్లు కొనుగోలు చేసేందుకు బేరం ఆడాడు. మధ్యలో మంగయ్యను తప్పించి ఇంటి ఓనర్‌తో నేరుగా మాట్లాడుకొని ఇల్లు కొనుగోలు చేశాడు. ఈ విషయంలో దీపక్‌తో మంగయ్యకు విభేదాలు ఏర్పడ్డాయి. శుక్రవారం రాత్రి ఆర్టీసీ బస్టాండ్‌ ఎదుట ఉన్న అమృత వైన్స్‌లో దీపక్‌ మద్యం సేవించేందుకు వెళ్లాడు. అదే సమయంలో మంగయ్య అక్కడకు రావటంతో వాళ్లిద్దరి మధ్య ఇంటి కొనుగోలు విషయంలో వాగ్వివాదం చోటు చేసుకుంది. మద్యం షాపు నుంచి ఇంటికి వెళ్తున్న దీపక్‌పై మంగయ్య రాడ్డుతో దాడి చేసి గాయపరిచాడు. క్షతగాత్రుడిని స్థానికులు ఏరియా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

పైపులు పడి బాలుడి మృతి

మాచవరం: మంచినీటి కోసం ఏర్పాటు చేసే పైపుల కిందపడి బాలుడు మృతి చెందిన ఘటన మండలంలోని పిలుట్ల శివారు అంజనీపురంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... పిల్లుట్ల–శ్రీ రుక్మిణీపురం గ్రామాల మధ్య జలజీవన్‌ మిషన్‌ పథకానికి పైపులైన్‌ ఏర్పాటు చేసేందుకు పనులు జరుగుతున్నాయి. అంజనీపురం సమీపంలో నిల్వ చేసిన పైపుల వద్ద గ్రామానికి చెందిన సైదు హుస్సేన్‌ (6) ఆడుకుంటున్నాడు. ఒక్కసారిగా పైపులు జారి బాలుడిపై పడటంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఘటన స్థలానికి చేరుకొని ఆ పైపులను తొలగించారు.

రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు

కొల్లిపర: మండల పరిధిలోని అన్నవరం గ్రామానికి చెందిన నలుగురికి రోడ్డు ప్రమాదంలో గాయాలైన సంఘటన శనివారం చోటు చేసుకుంది. దీనిపై స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నవరం గ్రామానికి చెందిన తాత శివమ్మ, ఎమినేని గోవిందమ్మ, తాత వెంకటసుబ్బారావు, ఎమినేని అనిత లంక పొలం పనులు ముంగిచుకుని కృష్ణానది కరకట్ట మార్గంలో బైకుపై ఇంటికి వస్తున్నారు. అతివేగంగా కారు వచ్చి బైకులను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. గాయాలైన వారిని స్థానికులు సీహెచ్‌సీకి తరలించారు. వైద్యులు వెంటనే ప్రాథమిక చికిత్స అందించారు. గాయాలైన వారిలో తాత శివమ్మ, ఎమినేని గోవిందమ్మలకు తీవ్రగాయాలు అవటంతో వైద్యులు మెరుగైన వైద్యం కోసం తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు

తరలించారు.

అర్ధరాత్రి పంట పొలం దున్నిన గుర్తు తెలియని వ్యక్తులు

తాడికొండ: అస్తి వివాదాల నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి పంటను దున్నిన ఘటన తాడికొండ మండలం నిడుముక్కల గ్రామంలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. తలశిల గోపి, చైతన్య అనే రైతులకు నిడుముక్కల గ్రామంలో పూర్వీకుల నుంచి సంక్రమించిన 4 ఎకరాల పంట భూమి ఉంది. 1990 నుంచి ఆ భూమిని సాగు చేస్తున్నారు. ఇటీవల కాలంలో గోపి, చైతన్యల పెద్దమ్మ తలశిల ఇందిర వచ్చి ఆ పొలంపై తనకు హక్కు ఉందని, ఎటువంటి చట్ట పరమైన ఆధారాలు చూపకుండా ఆ పొలంలో సర్వే చేయించి హద్దు రాళ్లు వేశారు. దీంతో బాధితులు ఇందిర తీరుపై కలెక్టర్‌, తహసీల్దార్‌, పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పొలంలో పాతిన హద్దు రాళ్లను తొలగించాలని కలెక్టర్‌ తహసీల్దార్‌ను ఆదేశించగా పోలీసుల సమక్షంలో వాటిని తొలగించారు. అయితే శుక్రవారం అర్ధరాత్రి ఇందిర, ప్రణీత్‌కుమార్‌లు కిరాయి పనులు చేసే వారితో పంట చేను దున్నించి, కౌలు రైతును బెదిరించారన్నారు. తమకు న్యాయం చేయాలని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తమకు ఇందిర వలన ప్రాణహాని ఉందని, ప్రాణ రక్షణ కావాలని వారు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement