గుంటూరు మెడికల్ ప్రతిష్ఠాత్మక ఐఐఆర్‌ఎఫ్ మెడికల్ కాలేజ్ ర్యాంకింగ్స్ 2026లో గుంటూరు మెడికల్ కాలేజీ జాతీయ స్థాయిలో 50వ స్థానాన్ని సాధించింది. దేశవ్యాప్తంగా ప్రముఖ వైద్య కళాశాలలకు సంబంధించిన ఈ ర్యాంకింగ్స్‌లో గుంటూరు మెడికల్ కాలేజీకి లభించిన స్థానం కళాశాల వర్గాల్లో ఆనందాన్ని కలిగించింది. శనివారం ఈ ఫలితాలు విడుదలయ్యాయి. ఎయిమ్స్ న్యూఢిల్లీ మొదటి స్థానంలో నిలిచింది. దేశంలోని 144 ప్రముఖ వైద్య కళాశాలల జాబితాను ప్రకటించారు. ఈ ర్యాంకింగ్స్‌కు సంబంధించిన వార్తను ప్రముఖ వైద్య, ఆరోగ్య వార్తా వేదిక మెడికల్ డైలాగ్స్ ప్రచురించింది. అందులో గుంటూరు మెడికల్ కాలేజీకి అఖిల భారత స్థాయిలో 50వ ర్యాంకు లభించింది. జాతీయ స్థాయిలో 50వ స్థానంలో నిలవటంతో శనివారం గుంటూరు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ నాగార్జున కొండ వెంకటసుందరాచారి హర్షం వ్యక్తం చేశారు. ఈ గుర్తింపు కళాశాల అధ్యాపకులు, వైద్యులు, విద్యార్థులు, నర్సింగ్ సిబ్బంది, పరిపాలనా సిబ్బంది , గుంటూరు జీజీహెచ్‌కు చెందిన ప్రతి ఒక్కరి సమష్టి కృషికి నిదర్శనమని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో 50వ స్థానం సాధించడం గుంటూరు జిల్లా ప్రజలకు, వైద్య కళాశాల విద్యార్థులకు ఆనందకరమైన విషయమని తెలిపారు. దీనిని ఒక ప్రారంభ విజయంగా మాత్రమే భావిస్తున్నట్లు వెల్లడించారు. దేశంలోని టాప్ 10 మెడికల్ కాలేజీల్లో గుంటూరు మెడికల్ కాలేజీకి స్థానం కల్పించడమే తమ లక్ష్యం అని డాక్టర్ సుందరాచారి తెలిపారు. గుంటూరు వైద్య కళాశాలను దేశంలోని అగ్రశ్రేణి వైద్య విద్యాసంస్థల్లో ఒకటిగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని డాక్టర్ ఎన్.వి.సుందరాచారి పిలుపునిచ్చారు.


