● 14 నుంచి కార్మెల్ మాత మహోత్సవాలు
● మూడురోజులపాటు నిర్వహణ
● తెలుగు రాష్ట్రాల నుంచి
తరలిరానున్న కథోలిక్కులు
ఫిరంగిపురం: మండలకేంద్రం కార్మెల్ కొండపై ఉన్న కార్మెల్‌మాత ఉత్సవాలు ఈనెల 14,15,16 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల సందర్భంగా నిర్వహించే దివ్యపూజాబలి కార్యక్రమంలో గుంటూరు మేత్రాసన గురువులు చిన్నాబత్తిని భాగ్యయ్య పాల్గొంటారని ఆలయ వర్గాలు శనివారం తెలిపాయి. 14 మంగళవారం సాయంత్రం కార్మెల్ మాత కొండవద్ద దివ్యపూజాబలి కార్యక్రమం విచారణ గురువు పి.అంతోని రాజు నిర్వహించనున్నారు. 15 బుధవారం ఉదయం కథెడ్రల్ దేవాలయంలో విచారణ గురువు ఫాతిమా మర్రెడ్డి, కొండపై 8గంటలకు విచారణ గురువు కె.సాగర్‌లు దివ్యపూజాబలి పూజలు నిర్వహిస్తారు. రాత్రి పదినుంచి ఉదయం 4 వరకు అఖండ జపమాల నిర్వహించనున్నారు. 16న ఉదయం బాల ఏసుదేవాలయంలో, 9గంటలకు కార్మెల్ కొండపైన దివ్యపూజాబలి నిర్వహిస్తారు. కార్యక్రమానికి విజయవాడ పీఠాధిపతి తెలగతోటి రాజారావు ప్రధాన యాజకులుగా వ్యవహరిస్తారు. తరువాత కార్మెల్ మాత మహోత్సవ సమిష్టి దివ్యపూజాబలి కార్యక్రమానికి గుంటూరు మేత్రాసన నూతన అభిషిక్త గురువులు పాల్గొంటారు. అనంతరం కార్మెల్‌మాత తేరు ప్రదక్షిణ నిర్వహించనున్నారు.
కార్మెల్‌మాత విశిష్టత..
క్రీస్తుపూర్వం 857లో ఆహాబురాజు పరిపాలన కాలంలో ఇజ్రాయేల్ దేశంలో అనావృష్టితో కరువు ఏర్పడింది. ఈపరిస్థితిలో ప్రవక్త ఏలియా కార్మెల్ పర్వత గుహలో ప్రవేశించి ప్రార్థించాడు. దీంతో ఆకాశంలో కారు మేఘాలు కమ్మి కుంభవృష్టిగా వర్షం కురిసింది. సమృద్ధిగా పంటలు పండి ప్రశాంతతకు దేశం నిలయంగా మారింది. అంతటి పవిత్రమైన కార్మెల్ పర్వతాన్ని స్మరించేందుకు వీలుగా 1885వ సంవత్సరంలో లండన్ మిల్‌హిల్ గురువులు తియోడర్ డిక్మన్ ఫిరంగిపురం విచారణ గురువులుగా, సహాయ విచారణ గురువుగా రాజనాడార్ ఉన్నారు. గ్రామంలోని కొండపైన లూర్డుమాత దేవాలయాన్ని నిర్మించారు. 1922వ సంవత్సరంలో జీబీజే ఫర్మెన్‌స్వామి, నోయప్ప స్వామి సహకారంతో అప్పటివరకు ఉన్న లూర్ధు మాత దేవాలయ స్థానంలో కార్మెల్‌మాత దేవాలయాన్ని పునర్నిర్మించారు.


