
ప్రజా సమస్యలపై స్పందించకుంటే చర్యలు
● అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి ● పీజీఆర్‌ఎస్‌లో వచ్చే వినతులు వెంటనే పరిష్కరించాలి ● కలెక్టర్ జె.వెంకటమురళి
బాపట్ల: జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు ఏమాత్రం అలసత్వం చూపినా సహించబోమని, నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవని బాపట్ల జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి హెచ్చరించారు. సోమవారం బాపట్ల కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి అర్జీలు నేరుగా స్వీకరించారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి వినతిపత్రాన్ని తక్షణమే పరిష్కరించేలా పూర్తి బాధ్యతతో వ్యవహరించాలన్నారు. మొత్తం 200 వినతులు అందగా, పలు సమస్యలకు తన సమక్షంలోనే పరిష్కారం చూపారు. మిగిలిన వినతులను సంబంధిత శాఖలకు పంపించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ స్థాయిలో పరిష్కారానికి సంబంధించిన విషయాలను రాష్ట్రానికి నివేదించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంపై రాష్ట్రస్థాయిలో నిర్వహించిన సమీక్షలో బాపట్ల జిల్లా 19వ స్థానంలో నిలవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాబోయే సమీక్షలో జిల్లా స్థానం మెరుగుపడకపోతే, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏ ఒక్క అధికారిని కూడా ఉపేక్షించబోమని, తగిన కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్ గంగాధర్‌గౌడ్, ఆర్డీఓ గ్లోరియ, డీఆర్డిఏ పీడీ శ్రీనివాస్, అన్ని శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు.