
ఉన్నపళంగా పొమ్మంటే ఎలాగయ్యా!
నెహ్రూనగర్: అభివృద్ధి పనులకు తాము వ్యతిరేకం కాదని.. ఇప్పుడు ఉన్న ఫళంగా నోటీసులు ఇళ్లు ఖాళీ చేయాలని చెప్పడం ఎంత వరకు సమంజమని, గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో కేటాయించిన స్థలాలను చూపించి.. మా ఇళ్లను పడగొట్టండి అంటూ నల్లపాడు చెరువు కట్ట నివాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నల్లపాడు చెరువు కట్ట నివాసితులు ఆందోళన నిర్వహించారు. తమ గోడు విన్నవించుకునేందుకు వస్తే అధికారులు తమపై మండిపడుతూ, బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మూకుమ్మడి ఆత్మహత్యలే గతి
18 సంవత్సరాలకు పైబడి ఊరికి దూరంగా కనీస మౌలిక వసతులు లేకపోయినప్పటికీ, రూ.వేల అద్దెలు చెల్లించే స్థోమత లేక చిన్న ఇళ్లు నిర్మించుకుని కూలీ పనులు చేసుకుంటూ తాము జీవిస్తున్నామని, ఆ ఇళ్లను ఖాళీ చేయాలంటూ జీఎంసీ అధికారులు రెండు సార్లు నోటీసులు జారీ చేశారని వాపోయారు. ఇళ్లు ఖాళీ చేయడంలో తమకు అభ్యంతరం లేదని.. కానీ గత ప్రభుత్వ హయాంలో కొర్నెపాడు దగ్గర ఇచ్చిన స్థలాలను తమకు చూపించి ఇళ్లు తొలగించాలని వారు ప్రాధేయపడ్డారు. ఉన్న ఫలంగా మమ్మల్ని ఖాళీ చేయాలని ఆదేశిస్తే ఎక్కడికి వెళ్లి బతకాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయం చూపకుండా తమ ఇళ్లను తొలగించాలని చూస్తే మూకుమ్మడి ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప మాకు గత్యంతరం లేదని వాపోయారు.
టిడ్కో ఇళ్లల్లో నివాసం కల్పించాలి
ప్రస్తుతం కొర్నెపాడులో తమకు ఇచ్చిన స్థలాల్లో రైతులు పంట పండిస్తున్నారని.. అవి తమకు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదని.. అడవి తక్కెళ్లపాడు, వెంగళాయపాలెంలో ఖాళీగా ఉన్న టిడ్కో ఇళ్లల్లో తమకు నివాసం ఉండేందుకు అవకాశం కల్పించాలని వారు కోరుతున్నారు.
స్థలాలు చూపించి మా ఇళ్లు పడగొట్టండి నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద నల్లపాడు చెరువు కట్ట నివాసితుల ఆందోళన

ఉన్నపళంగా పొమ్మంటే ఎలాగయ్యా!