
ఉచిత బస్సు తరువాత జాతర వాతావరణం
ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): మహిళలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా ఉచిత బస్సు అంశంపై నెల్లూరు జోన్ పరిధిలోని గుంటూరు, పల్నాడు, ప్రకాశం, బాపట్ల, నెల్లూరు జిల్లాల అధికారులతో గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని కార్యాలయంలో బుధవారం ఎండీ ద్వారకా తిరుమలరావు, చైర్మన్ నారాయణ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళల ప్రయాణం ఏర్పాలయ్యాక కొద్ది రోజులు జాతర వాతావరణం ఉంటుందని తెలిపారు. ఆర్టీసీ పరిధిలో ఉచిత బస్సుల సౌకర్యం కల్పించేందుకు విధి విధానాలు, సంసిద్ధత, సౌకర్యాల కల్పనపై అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పూర్తిస్థాయిలో ఆపరేషన్ చేసేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలని పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు ఎటువంటి ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాలేదని తెలిపారు. త్వరలో జరిగే క్యాబినెట్ సమావేశం అనంతరం పూర్తిస్థాయిలో అధికారికంగా వెలువడే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణం ఉంటుందని, వారు ఆధార్, పాన్‌కార్డు వంటి గుర్తింపు కార్డులు కలిగి ఉండాలని ఆయన సూచించారు. ఆర్టీసీ ఎండీ నుంచి డీఎం వరకు సమష్టిగా కృషి చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే 1050 బస్సులు రానున్నట్లు తెలిపారు. అధికారికంగా ఆదేశాలు రానప్పటికీ, పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, డీలక్స్, సిటీ బస్సుల్లో ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తున్నామని వెల్లడించారు. అవకాశం ఉన్న వరకు ఎక్కడ నుంచైనా రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు తిరిగే అవకాశం ఇస్తున్నామని, సిబ్బందికి కూడా కొద్దిగా పని పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఆర్టీసీ చైర్మన్ నారాయణ మాట్లాడుతూ త్వరలోనే మార్గదర్శకాలు రానున్నాయని తెలిపారు. కార్యక్రమంలో నెల్లూరు జోన్ పరిధిలో ఈడీలు, ఆర్‌ఎం, డీఎంలు, ఇంజనీరింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు.