
‘సీనియర్ సిటిజన్ల’ చట్టంపై అవగాహన అవసరం
జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు
నరసరావుపేట: తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల నిర్వహణ, సంక్షేమ చట్టం, 2007పై విసృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు పేర్కొన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా విభిన్న ప్రతిభావంతుల, సీనియర్ సిటిజెన్స్, ట్రాన్స్‌జెండర్ శాఖ ఆధ్వర్యంలో తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల నిర్వహణ, సంక్షేమ చట్టం, 2007, ట్రాన్స్ జెండర్ హక్కుల చట్టం 2019 అమలుపై ఒకరోజు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, విభిన్న ప్రతిభావంతులు, సీనియర్ సిటిజన్స్, ట్రాన్స్ జెండర్‌ల సంక్షేమ శాఖ ఏడీ దుర్గా భాయ్, వరలక్ష్మి, లాయర్ శిరీష పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు, పిల్లల మధ్య సఖ్యత లేని కారణంగా వారి మధ్య వివాదాలు తలెత్తుతున్నాయన్నారు. అన్నివర్గాల కుటుంబాల్లోనూ ఇటువంటి పరిస్థితి చూస్తున్నామన్నారు. తల్లిదండ్రుల, వృద్ధుల సంరక్షణలో ఆయా కుటుంబ సభ్యుల బాధ్యత వహించాల్సి ఉందని, తల్లిదండ్రులతో సహా ఎవరైనా సీనియర్ సిటిజన్ తన సొంత సంపాదన నుంచి లేదా అతని సొంత ఆస్తి నుంచి తనను తాను కాపాడుకోలేక పోయినప్పుడు ప్రాథమికంగా ఆర్‌డీఓ అధ్యక్షతన ఉన్న ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఆర్డీఓ ద్వారా నోటీసులు అందించి విచారణ చేసి సమస్యను సానుకూలంగా పరిష్కరించడం జరుగుతుందన్నారు. వయోవృద్ధులు, తల్లిదండ్రులను, నిర్లక్ష్యం వహించే కుమారులు, కుమార్తెలపైన చట్టపరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే అరవింద బాబు మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్ హక్కుల చట్టం 2019 ద్వారా ట్రాన్స్ జెండర్‌లకు హక్కులు కల్పించడం జరిగిందన్నారు. లాయర్ శిరీష పలు సూచనలు, సలహాలు అందించారు.
మానవ అక్రమ రవాణాపై అవగాహన సదస్సు
నరసరావుపేట టౌన్: మానవ అక్రమ రవాణాపై పట్టణంలోని పెద్ద చెరువు 9వ లైన్‌లో గల బాలుర సంక్షేమ వసతి గృహంలో బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానిక మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో ప్రధాన సీనియర్ సివిల్ అధికారి కె. మధుస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరు వ్యక్తులు చిన్నపిల్లలను చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగిస్తున్నారన్నారు. వెట్టి చాకిరి, యాచకత్వం, తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాల కోసం బాలురను వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. విద్యార్థులు అపరిచితులను నమ్మ వద్దన్నారు. దీనిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే హాస్టల్ వార్డెన్ దృష్టికి తీసుకురావాల్సిందిగా ఆయన సూచించారు. ప్యానల్ న్యాయవాదులు, పారా లీగల్ వలంటీర్లు, హాస్టల్ వార్డెన్లు, విద్యార్థులు, టూటౌన్ పోలీసులు పాల్గొన్నారు.

‘సీనియర్ సిటిజన్ల’ చట్టంపై అవగాహన అవసరం