
3న బాల్ బ్యాడ్మింటన్ పోటీలు
గుంటూరు వెస్ట్ (క్రీడలు): గుంటూరు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా జూనియర్ , సబ్ జూనియర్, సీనియర్ పురుషులు, మహిళల జిల్లా స్థాయి పోటీలు నిర్వహిస్తామని జిల్లా అధ్యక్షుడు ఈ.శివశంకర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే నెల 3వ తేదీ ఉదయం 8 గంటలకు స్థానిక ఎన్జీఓ క్లబ్‌లో పోటీలు జరుగుతాయన్నారు. పోటీలకు వచ్చే వారు ఆధార్ కార్డుతో పాటు వయస్సు ధృవీకరణ పత్రాన్ని తీసుకురావాలన్నారు. వివరాలకు 93477 85888 నెంబర్‌లో సంప్రదించాలన్నారు.
జంట హత్యల కేసులో
నిందితుల అరెస్టు
నరసరావుపేట టౌన్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో నిందితులను నరసరావుపేట వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేసి బుధవారం రిమాండుకు తరలించారు. ఆర్థిక వివాదాల నేపథ్యంలో ఈనెల 23న పట్టణంలోని కోర్టు భవనాల ఎదుట శ్రీనిధి గ్రాండ్ హోటల్ వద్ద బెంగళూరుకు చెందిన తండ్రి కొడుకులు కె.వీరస్వామిరెడ్డి, కె.వి.ప్రశాంతరెడ్డిలను కిడ్నాప్ చేసి బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం పాతమాగులూరు వద్ద అనిల్ రెడ్డి, బాదం మాధవరావు, గడ్డం రఘురాంరెడ్డి తదితరులు హతమార్చినట్లు కేసు నమోదయింది. కిడ్నాప్ జరిగిన ప్రదేశం నరసరావుపేట, హత్య జరిగిన ప్రదేశం బాపట్ల జిల్లా పాతమాగులూరు కావడంతో, దర్యాప్తు ప్రక్రియ క్లిష్టతరంగా మారింది. పోలీసు ఉన్నతాధికారులు రెండు కేసులను నరసరావుపేట వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు, నరసరావుపేట డీఎస్పీ కె.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీఐలు ఎం.వి.చరణ్, హైమారావు, బి.సుబ్బానాయుడు, పి.రామకృష్ణల నేతృత్వంలో ఎస్‌ఐలు హరిబాబు, వంశీకృష్ణలు ప్రత్యేక బృందాలుగా ముంబయి వెళ్లి మూడు రోజుల వ్యవధిలోనే ప్రధాన నిందితులైన బాపట్ల జిల్లా సంతమాగులూరు గ్రామానికి చెందిన బాదం మాధవరెడ్డి, గడ్డం రఘురాంరెడ్డి, గడ్డం నాగిరెడ్డి, గడ్డం గోపిరెడ్డి, గడ్డం ఇంద్రసేనారెడ్డిలను ఈనెల 27వ తేదీ ఉదయం 10 గంటలకు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను పట్టణానికి తెచ్చి బుధవారం న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు మొత్తం 13 మందిని నిందితులుగా పేర్కొన్నారు. గతంలో అనిల్ రెడ్డిని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు.
ఇంటర్ విద్య సంస్కరణలపై అవగాహన అవసరం
నరసరావుపేట ఈస్ట్: ఇంటర్మీడియెట్ విద్యా విధానంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఇంటర్మీడియెట్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ జె.పద్మ తెలిపారు. పల్నాడుజిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారి కార్యాలయంలో బుధవారం జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో ఇంటర్ విద్య సంస్కరణలపై అవగాహన సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆర్‌జేడీ జె.పద్మ మాట్లాడుతూ, విద్యార్థులకు ప్రతి వారాంతంలో పోటీ పరీక్షలు నిర్వహించాలనీ, ప్రశ్నాపత్రాలను ఇంటర్ బోర్డు అందిస్తుందన్నారు. తరగతి గదుల్లో విద్యార్థులతో పాటు అధ్యాపకులు సైతం మొబైల్ ఫోన్లు వినియోగించకూడదని స్పష్టం చేశారు. సిబ్బంది సమయపాలన పాటిస్తూ ఎఫ్‌ఆర్‌ఎస్ యాప్‌లో హాజరు నమోదు చేయాలని తెలిపారు. అధ్యాపకులు డ్రెస్‌కోడ్ పాటించాలన్నారు. జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారి ప్రతినెలా రెండు కళాశాలలను ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు నిర్వహించాలని సూచించారు. గుంటూరు ఆర్‌ఐఓ సునీత మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణతా శాతం పెరగటంతో ప్రవేశాలు సైతం పెరిగాయని తెలిపారు. అధ్యాపకులు నాణ్యమైన విద్యా బోధన అందించాలని కోరారు. డీఐఈఓ ఎం.నీలావతిదేవి మాట్లాడుతూ, అధ్యాపకులు ప్రతి ఒక్క విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ కలిగి ఉండాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో విద్యార్థుల పురోగతిపై చర్చించాలని కోరారు.