
తీర భూములపై పచ్చ గద్దలు
సాక్షి ప్రతినిధి,బాపట్ల: బాపట్ల మండలం పాండురంగాపురం సముద్ర తీరప్రాంతంలో చీరాలకు చెందిన టీడీపీ నేత బుర్ల వెంకట్రావు ప్రభుత్వ, అసైన్డ్ భూములను కబ్జాచేసి వాటికి పట్టాలు పుట్టించడమేకాక సదరు భూములను గుంటూరులోని మరో పచ్చ ప్రజాప్రతినిధికి చెందిన భ్రమర ఇన్‌ఫ్రాకు ధారాదత్తం చేసి కోట్లు ఆర్జించినట్లు తొమ్మిది గ్రామాలకు చెందిన మత్స్యకారులు ఆరోపించారు. పచ్చనేత భూ దాహం కారణంగా రెండు వేలబోట్లు సముద్రంలోకి వెళ్లే దారిలేదని, దానివల్ల భృతి కోల్పోయి పస్తులుండాల్సి వస్తోందని మత్స్యకారులు ఆవేదన చెందారు. న్యాయం చేసే వరకు పోరాటం చేస్తామంటూ ఆక్రమిత భూముల వద్ద భైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ విషయం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జిల్లా కలెక్టర్ వెంకట మురళి చొరవతో మత్స్యకారుల గొడవ తాత్కాలికంగా సర్దుమణిగినా తీరంలో పచ్చనేతల భూ ఆక్రమణల వ్యవహారం మరో మారు వెలుగు చూసింది. ఒక్క బుర్ల వెంకట్రావు ఎపీసోడే కాదు బాపట్ల మండల పరిధిలో పలువురు పచ్చనేతలు వారి అనుమాయుల భూకబ్జాల వ్యవహారం శృతిమించింది. కూటమి అధికారంలోకి రావడంతో పచ్చ కబ్జాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. తీర ప్రాతంలో టూరిజం పెరిగి ఎకరం రూ.మూడు నుంచి రూ.5కోట్లు పలుకుతుండడంతో కనిపించిన స్థలాన్నల్లా పచ్చనేతలు ఆక్రమిస్తున్నారు. ప్రభుత్వ భూములతోపాటు అసైన్డ్ భూములను వదలి పెట్టడంలేదు. తొలుత కబ్జాచేసి గతంలో వేరొకరి వద్ద కొన్నట్లు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టిస్తున్నారు. వాటిని చూపి కబ్జా స్థలాలను అమ్మే స్తున్నారు. కొన్నింటిని ఏకంగా రిజిస్ట్రేషన్‌లు కూడా చేస్తున్నారు. అధికారులకు డబ్బులు ముట్టజెప్పి ఆన్‌లైన్ చేసుకుంటున్నారు. ఫేక్ పట్టాలను ఇతర ప్రాంతాల నుంచి భూములు, స్థలాలను కొనేవారికి చూపి ఆక్రమిత భూములను అమ్మకానికి పెట్టి కోట్లు కొల్లగొడుతున్నారు. మండలంలోని సూర్యలంక మొదలుకొని రామచంద్రాపురం, దాన్వాయిపేట, కృపానగన్, పాండురంగాపురం, ఓడరేవు ప్రాంతాల వరకూ తీరంలో ప్రభుత్వ, అసైన్డ్ భూముల కబ్జాలకు అంతులేకుండా పోయింది. రామచంద్రాపురం ప్రాంతంలో చీరాల మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావు ఏకంగా సముద్రం అలల వరకూ తీరాన్ని ఆక్రమించి కంచె నిర్మించారు. మత్స్యకారులు చేపలు ఆరబోసేందుకు వేసుకున్న ప్లాట్‌ఫారంను ధ్వంసం చేశారు. ప్రశ్నించిన మత్స్యకారులను బెదిరించారు. అలల వరకూ తమదేనని హెచ్చరించారు. బోట్లు ఎక్కడ పెట్టుకోవాలో తెలియడంలేదని మత్స్యకారులు సాక్షితో వాపోయారు. తీరంలో పచ్చనేతల దౌర్జన్యాలు కోకొల్లలు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.
తీరం భక్షక దళం సీఆర్‌జెడ్
తీరంలో సీఆర్‌జెడ్ కీలకమైన వ్యవస్థ. తీర ప్రాంతంలో ఎంత దూరం వరకూ ఉంటుందో వారే చెప్పాలి. ఒకరకంగా వారు తీరం రక్షణదళం. కానీ ఇక్కడ సీఆర్‌జెడ్ తీరం భక్షక దళంలా మారిందన్న ఆరోపణలున్నాయి. తీర ప్రాంతాన్ని అలల వరకూ కబ్జా చేస్తున్నా వారు కన్నెత్తి చూడడంలేదు. వాస్తవానికి సీఆర్‌జెడ్ నిబంధనల ప్రకారం సముద్రం ఎంతవరకు ఉంటుందో వారు స్పష్టత నివ్వడంలేదు. తీరంలో ఒక్కో దగ్గర ఒక్కోలా నిబంధనలు ఉంటాయని మాత్రమే చెప్పి తప్పించుకుంటున్నారు. తీరం అలల దాకా దాకా పచ్చనేతలు భూములు ఆక్రమించినా సీఆర్‌జెడ్ పట్టించుకోవడంలేదు. బాపట్ల జిల్లాలో తీరం మొత్తాన్ని కబ్జాల మయంగా మార్చడం వెనుక సీఆర్‌జెడ్ అధికారుల పాత్రవుందని, అందిన కాడికి దండుకొని కబ్జాదారులకు అండగా నిలుస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే బాపట్ల మండలం సూర్యలంక మొదలు వేటపాలెం మండలం పొట్టిసుబ్బయ్యపాలెం ప్రాంతం వరకూ తీరప్రాతం కబ్జాకు గురైంది. సీఆర్‌జెడ్ నిబంధనలకు పాతరేసి రోడ్లు ఇతర దుకాణాలు నిర్మించారు. ఆక్రమిత స్థలాల్లో రిసార్ట్‌లు వెలిశాయి. సీవ్యూ కోసం రిసార్ట్‌లవారు తీరం రక్షణ కోసం పెంచిన మడ, సర్వి, ఇతర మొక్కలను తొలగించి వేశారు. అయినా సీఆర్‌జెడ్ స్పందించే పరిస్థితి లేకుండా పోయింది.
బాపట్ల తీరంలో ఉన్న వందలాది ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూములు టూరిజం పెరగడంతో పెరిగిన భూముల విలువ కూటమి అధికారంలోకి రావడంతో తీరం భూములపై పచ్చనేతల కన్ను ఇప్పటికే అడవి పంచాయతీలో భూములను స్వాధీనం చేసుకున్న పచ్చనేతలు నకిలీ పట్టాలు పుట్టించి ఆక్రమణలు కొందరు ఫేక్ అగ్రిమెంట్లతో భూముల కబ్జా మరికొందరు వేరే సర్వే నంబర్లు వేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న వైనం కిందిస్థాయి రెవెన్యూ అధికారుల సహకారంతో భూ కబ్జాలు ఆక్రమిత భూములను విక్రయిస్తున్న పచ్చముఠా
కలెక్టర్ గారూ..
తీరప్రాంతంలో భూ కబ్జాలకు కొందరు రెవెన్యూ అధికారులే సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అక్రమాల ఆరోపణలు శృతిమించడంతో వేటపాలెం తహసీల్దారు పార్వతిని కలెక్టర్ సరెండర్ చేసినట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరిగింది. ఈ ఘటన మిగిలిన రెవెన్యూ అధికారుల్లో కొంత భయం కలిగించింది. అదే తరహాలో అక్రమాలకు తెగబడుతున్న మిగిలిన అధికారులపైనా చర్యలకు దిగితే తీరం కబ్జా కాకుండా ఆగే అవకాశముంది. బాపట్ల మండలం మొదలు చినగంజాం వరకూ తీరంలో ఆక్రమణలు శృతిమించాయి. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠిన చర్యలకు దిగితే తీరాన్ని కాపాడవచ్చు. తద్వారా పర్యాటకాన్ని అభివృద్ధి వైపు నడిపించవచ్చు. అలా కాకుండా పచ్చనేతల కబ్జాలను చూస్తూ పోతే తీరం మొత్తం కబ్జా కోరల్లో చిక్కుకునే అవకాశముంది. సమర్దులైన అధికారుల కమిటీతో తీరంపై విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంది.

తీర భూములపై పచ్చ గద్దలు