
నల్లబర్లీ కొనుగోలులో జాప్యం తగదు
ఇంకొల్లు(చినగంజాం): నల్లబర్లీ పొగాకు కొనుగోలు విషయంలో ప్రభుత్వం జాప్యం చేయడం తగదని రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి వి.కృష్ణయ్య అన్నారు. పర్చూరు, కారంచేడు, ఇంకొల్లు మండలాల్లో రాష్ట్ర రైతు సంఘం, జిల్లా రైతు సంఘం నాయకులు మంగళవారం పర్యటించారు. అనంతరం ఇంకొల్లు యూటీఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కృష్ణయ్య మాట్లాడారు. పొగాకు సాగు చేసిన రైతుల వద్ద నుంచి 40 రోజులుగా పొగాకు కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రైవేట్ కంపెనీలు, ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో 35 శాతం మాత్రమే ఇప్పటి వరకు కొనుగోలు చేశారన్నారు. రైతులు వద్ద 65 శాతం పొగాకు నిల్వలు ఇంకా మిగిలి ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం మార్క్‌ఫెడ్ అధికారులు కొనుగోలు నెమ్మదిగా కొనసాగించడం వలన షెడ్యూల్ పేరుతో జాప్యం జరగుతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. ప్రభుత్వం ఆగస్టు 20వ తేదీ నాటికి నల్లబర్లీ పొగాకు కొనుగోలు పూర్తి చేయాలని ప్రకటించిందని దాంతో రైతుల్లో ఆందోళన మరింత పెరిగిందన్నారు. ప్రభుత్వ ప్రకటనలను అవకాశంగా తీసుకున్న పొగాకు కంపెనీలు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు. ఉప్పుటూరు గ్రామంలో దక్కన్ కంపెనీ రైతుల వద్ద రూ.6500కి కొనుగోలు చేసి అనంతరం నాణ్యత లేదని క్వింటాకు రూ. వెయ్యి తగ్గించారన్నారు. మార్క్‌ఫెడ్ ద్వారా 25 మిలియన్‌లు పొగాకు కొనుగోలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటికి కేవలం 5 మిలియన్ కేజీలు కూడా కొనుగోలు చేయలేదన్నారు. అదేవిధంగా పొగాకు కొనుగోలు చేసిన 48 గంటలలో రైతుల బ్యాంక్ అకౌంట్‌లో నగదు జమ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు 40 రోజులు పూర్తి అయినా జమకాలేదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు చివరి వరకు పొగాకు కొనుగోలు చేయకుంటే ఆందోళన తీవ్ర తరం చేస్తామన్నారు.
జిల్లా కార్యదర్శి తలపనేని రామారావు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం సాఫ్ట్‌వేర్‌ను క్వింటాల రూపంలో రూపకల్పన చేశారని అలా కాకుండా 500 చెక్కులను రూపకల్పన చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా రైతు సంఘం కార్యదర్శి పి.కొండయ్య, నాయకులు వరికోటి శ్రీనివాసరెడ్డి, డేవిడ్, భానుస్రసాద్ పాల్గొన్నారు.
రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి వి.కృష్ణయ్య 65 శాతం పొగాకు నిల్వలు రైతులు వద్ద పేరుకుపోయాయంటూ ఆవేదన 48 గంటల్లో రైతుల అకౌంట్‌లో నగదు జమ చేస్తామనే హామీ ఏమైంది? రైతుల వద్ద చివరి కాడ వరకు పొగాకు కొనుగోలు చేయకుంటే ఆందోళన