అయితానగర్‌లో జనతరంగం | - | Sakshi
Sakshi News home page

అయితానగర్‌లో జనతరంగం

Jun 4 2025 1:25 AM | Updated on Jun 4 2025 8:37 AM

అయితానగర్‌లో జనతరంగం

అయితానగర్‌లో జనతరంగం

తెనాలి:ఎటుచూసినా జనతరంగం... దారిపొడవునా ఉప్పొంగిన అభిమానం... ప్రియతమ నేతను కనులారా చూసేందుకు ఆత్రుత, ఆరాటం... వెల్లువలా కదిలివచ్చిన జనంతో కిక్కిరిసిన రోడ్లు... జననేత కనిపించగానే చిరునవ్వులు చిందిస్తూ, ఆ క్షణాలను సెల్‌ఫోన్లలో బంధిస్తూ... హృదయం నిండా సంతోషంతో అభిమానులు మురిసిపోయారు. ‘సీఎం.. సీఎం..’ అంటూ తమ మనసులోని కోరిక ను పదేపదే నినదించారు. నడిరోడ్డుపై బహిరంగంగా పోలీసుల దాష్టీకానికి గురైన ముగ్గురు దళిత, మైనారిటీ యువకుల తల్లిదండ్రులను పరామర్శించేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి మంగళ వారం చేసిన పర్యటన ఆద్యంతం జనసంద్రాన్ని తలపించింది.

పేదలకు అండగా నిలిచేందుకు...
స్థానిక కానిస్టేబుల్‌పై ఏప్రిల్‌ 24వ తేదీ రాత్రి దాడి చేశారన్న ఫిర్యాదుపై పట్టణానికి చెందిన యువకుడు, ఆ సమయంలో అక్కడే ఉన్న ఇద్దరు మంగళగిరి యువకులను ఏప్రిల్‌ 27వ తేదీన పోలీసులు అరెస్టు చూపారు. వాస్తవానికి ఘటన జరిగిన మరుసటిరోజునే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్‌స్టేషనులో థర్డ్‌ డిగ్రీ ప్రయోగించటమే కాకుండా, అరెస్టు చూపటానికి ముందే 26, 27వ తేదీల్లో జయప్రకాష్‌నగర్‌లోని సత్యం సమాధి దగ్గర నడిరోడ్డుపై, అయితానగర్‌లోని కూడలి ప్రదేశం నన్నపనేని లింగారావు సెంటరులో టూటౌన్‌, త్రీటౌన్‌ సీఐలు ఆ యువకులను బహిరంగంగా లాఠీలతో హింసించారు. ఇందులో సత్యం సమాధి దగ్గర చేసిన భౌతికదాడి కొద్దిరోజుల క్రితం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావటం తెలిసిందే. ఏదైనా కేసులో నిందితులను చట్టప్రకారం అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపాల్సిన పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవటంపై దళిత, ప్రజాసంఘాలు ఆగ్రహించాయి. మానవ హక్కుల కమిషన్‌, ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. బాధితుల కుటుంబసభ్యులు టూటౌన్‌ పోలీస్‌స్టేషనులో పోలీస్‌ అధికారులపై ఫిర్యాదు కూడా చేశారు. ఈ నేపథ్యంలో బాధిత యువకుల తల్లిదండ్రులను పరామర్శించేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తెనాలి వచ్చారు.

నాయకుల ఘనస్వాగతం
పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, పార్టీ వేమూరు ఇన్‌చార్జి వరికూటి అశోక్‌బాబు, పార్టీ జిల్లా ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు గెడ్డటి సురేంద్ర, తెనాలి ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, పార్టీ మండల అధ్యక్షుడు చెన్నుబోయిన శ్రీనివాసరావులు ఘనంగా స్వాగతం పలికారు. వందలాది ద్విచక్ర వాహనాలు ముందు బయలుదేరగా.. వైఎస్‌ జగన్‌ కాన్వాయ్‌ అనుసరించింది.

అర్ధగంటపాటు పరామర్శలు
మధ్యాహ్నం 12.12 గంటలకు దోమా రాకేష్‌ నివాసంలో రాకేష్‌ తల్లిదండ్రులు వాసు–మాధవి, మంగళగిరికి చెందిన షేక్‌ బాబులాల్‌ తల్లిదండ్రులు అమీర్‌బాషా–రహమ్‌తున్‌, చేబ్రోలు జాన్‌విక్టర్‌ తండ్రి ఇశ్రాయెల్‌ను కలిశారు. పోలీసుల హింసకు సంబంధించిన వివరాలను వారి నుంచి తెలుసుకు న్నారు. తమ బిడ్డలను దారుణంగా కొట్టిన పోలీసు అధికారులపై తాము పెట్టిన కేసు రిజిస్టరు చేయాలని, చట్టప్రకారం సస్పెండ్‌ చేసి అరెస్టు చేయాలని బాధిత యువకుల తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు. దాదాపు అర్ధగంటసేపు వారితో గడిపిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆ ఇంటికి సమీపంలోనే మీడియాతో మాట్లాడారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement