కారుబోల్తా.. నలుగురికి గాయాలు
ఒకరి పరిస్థితి విషమం గుంటూరు వైద్యశాలకు తరలింపు
బాపట్లటౌన్: కారు బోల్తాపడి.. నలుగురు యువకులు గాయపడిన ఘటన మండలంలోని సూర్యలంక రోడ్డులో సోమవారం చోటుచేసుకుంది. మండలంలోని అసోదివారిపాలేనికి చెందిన ముడుగు రంగారెడ్డి, మర్రి సింహారెడ్డి, మంచాల ఏడుకొండలరెడ్డిలతో పాటు మండలంలోని వెదుళ్లపల్లి కొత్తపాలెం గ్రామానికి దొంతిన నాని తన స్నేహితుడిని సూర్యలంకలోని ఎయిర్‌ఫోర్స్ హాస్పిటల్‌లో చేర్చేందుకు సోమవారం సాయంత్రం కారులో వెళ్లారు. ఎయిర్‌ఫోర్స్ నుంచి బాపట్ల వైపు వస్తుండగా సూర్యలంక రోడ్డులోని చప్టా సమీపంలోకి వచ్చే సరికి కారు అదుపుతప్పి చప్టావద్ద బోల్తాపడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు కారులో నుంచి జారి రోడ్డు పక్కనే పడ్డారు. సమాచారం అందుకున్న రూరల్ సీఐ కె.శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108లో చీరాలలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం నలుగురు వ్యక్తులు చీరాలలో చికిత్స పొందుతున్నారు. వీరిలో మర్రి సింహారెడ్డి పరిస్థితి విషమం ఉన్నట్లు సమాచారం. మెరుగైన చికిత్స కోసం గుంటూరు తరలించారు. బాపట్ల ఆర్డీఓ పి.గ్లోరియా, తహసీల్దార్ షేక్ సలీమా, రూరల్ సీఐ కె. శ్రీనివాసరావు చీరాలలోని వైద్యశాలకు వెళ్లి క్షతగాత్రుల పరిిస్థితి అడిగి తెలుసుకున్నారు. వైద్యశాల యాజమాన్యంతో మాట్లాడి మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు.


