అర్జీలు గడువులోగా నాణ్యతతో పరిష్కరించాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్
బాపట్ల: పీజీఆర్‌ఎస్ అర్జీలు గడువులోగా నాణ్యతతో పరిష్కరించేలా పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ అధికారులను ఆదేశించారు. అర్జీలను పరిశీలించిన అనంతరం కలెక్టరేట్‌లోని కమాండ్ కంట్రోల్ రూమ్ అధికారులు, సిబ్బందితో స్థానిక న్యూ వీసీ హాల్‌లో కలెక్టర్ సోమవారం సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సేవలు సచివాలయాలు, మీసేవ కేంద్రాల ద్వారా ప్రజలకు అందుబాటులోకి వెళ్లేలా పర్యవేక్షించాలని కలెక్టర్ తెలిపారు. వంద సేవలు మాత్రమే ప్రస్తుతం అందుతున్నాయని, మరిన్ని సేవలు అందుబాటులో ఉన్న విషయాలపై అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలు, గ్రామ పంచాయతీలలో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఇందుకోసం ప్రచార బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. పీజీఆర్‌ఎస్ అర్జీలు క్షుణ్ణంగా పరిశీలించి, విచారించాలన్నారు. ప్రజలకు మేలు జరగడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలన్నారు. ఆ దిశగా కమాండ్ కంట్రోల్ రూమ్ సిబ్బంది అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు సమాచారం సేకరించాలన్నారు. నిషేధిత భూముల జాబితా నుంచి పట్టా భూములను తొలగించేందుకు సచివాలయాలలో ప్రత్యేకంగా అర్జీలు నమోదు చేయించాలన్నారు. ఐ–జి ఓ టి, ఈ శ్రమ పోర్టల్ నమోదు కార్యక్రమాలను జయప్రదంగా నిర్వహించడానికి అనుబంధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలపై ఎప్పటికప్పుడు వివరాలు పంపాలన్నారు. సమావేశంలో రెవెన్యూ అధికారి జి గంగాధర్‌గౌడ్, ఉప కలెక్టర్ లవన్న, మెప్మా పీడీ ఆనందసత్యపాల్, సీపీఓ షాలేం రాజు, కార్మిక శాఖ అధికారి వెంకట శివప్రసాద్, పౌర సరఫరాల సంస్థ మేనేజర్ శ్రీలక్ష్మి, కమాండ్ కంట్రోల్ రూమ్ సిబ్బంది పాల్గొన్నారు.
విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలి
విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలని, మంచిగా చదువుకోవాలనే ఉద్దేశంతో ముస్తాబు కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ తెలిపారు. ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ముస్తాబు కార్యక్రమాన్ని బాపట్ల పట్టణం డీకే పాలెం మున్సిపల్ ప్రాథమికోన్నత పాఠశాలలో సోమవారం విద్యార్థులతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. పాఠశాలలో విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలని ఇందు కోసమే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందన్నారు. కార్యక్రమం విద్యార్థుల్లో వ్యక్తిగత ఆత్మస్థైర్యం పెరుగుదలకు దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి శ్రీనివాస్, ఆర్డీఓ పి గ్లోరియా, ఎంఈఓలు డి శ్రీనివాస్, డి ప్రసాదరావు, తహసీల్దార్ షాలిమా, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
భూసేకరణ పనులు వేగవంతం చేయాలి
బాపట్ల:బాపట్లలో చేపట్టిన ప్రాజెక్టులు త్వరగా పూర్తిచేస్తే జిల్లా అభివృద్ధి బాటలో పయనిస్తుందని, ఇందు కోసం భూసేకరణ త్వరగా చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ ఆదేశించారు. భూ సేకరణ ప్రక్రియపై రెవెన్యూ అధికారులతో సోమవారం స్థానిక కలెక్టరేట్ నుంచి వీక్షణ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ రహదారుల అభివృద్ధితో రవాణా వ్యవస్థ పెరుగుతుందని, తద్వారా ప్రజల ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతగా భావిస్తున్న అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ భావన విశిష్ట, డీఆర్వో జి.గంగాధర్‌గౌడ్, ఉప కలెక్టర్ లవన్న, ఆర్డీవోలు గ్లోరియా, చంద్రశేఖర్, రామలక్ష్మి, జల వనరుల శాఖ, రోడ్లు భవనాల శాఖ, అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు.
ఆహార పదార్థాలలో కల్తీలు ఉంటే
ఆరోగ్యానికి హానికరం
ఆహార పదార్థాలలో కల్తీలు ఉంటే ప్రజల ఆరోగ్యానికి హానికరమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ తెలిపారు. వినియోగదారుల అవగాహన వారోత్సవాల్లో భాగంగా ఆహార భద్రత నాణ్యతశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన గోడపత్రాలు, కరపత్రాలను జిల్లా కలెక్టర్ సోమవారం కలెక్టరేట్‌లో విడుదల చేశారు. నాణ్యంగా, సురక్షితమైన ఆహార పదార్థాలతోనే ప్రజల ఆరోగ్యం పదిలంగా ఉంటుందని కలెక్టర్ చెప్పారు. ఆహార పదార్థాలలో కల్తీలు అధికంగా వస్తున్నందున ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఆహార పదార్థాల ఉత్పత్తులను ప్రజలు పరిశీలించాలన్నారు. రంగులు వినియోగించే ఆహార పదార్థాలు ప్రజారోగ్యానికి హానికరమన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి ఆహార భద్రతపై అవగాహన పొందాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ భావన విశిష్ట, డీఆర్వో జి.గంగాధర్‌గౌడ్, ఉప కలెక్టర్ లవన్న, డీఎస్‌ఓ జమీర్ బాషా, ఆహార భద్రత తనిఖీ అధికారి ప్రణీత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి హామీ పథకం పనులు
వేగవంతం చేయాలి
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో నిర్వహించే పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్‌కుమార్ అధికారులకు సూచించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని మినీ వీక్షణ సమావేశ మందిరంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల పురోగతిపై సంబంధిత లైన్ డిపార్టుమెంట్ల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
కార్యక్రమంలో డ్వామా పీడీ విజయలక్ష్మి, పశుసంవర్ధక శాఖ జేడీ వేణుగోపాల్, వీక్షణ సమావేశం ద్వారా హౌసింగ్ పీడీ వెంకటేశ్వరరావు, అన్ని మండల ఏపీవోలు, హౌసింగ్ ఏఈలు తదితరులు పాల్గొన్నారు.


