గ్యాస్ లీకై ఇల్లు దగ్ధం
ఒక్కసారిగా పేలిన సిలిండర్
మంటలకు మాడిన బంగారు ఆభరణాలు
రూ. నాలుగు లక్షల వరకు నష్టం
ఆదుకోవాలని బాధితుల ఆవేదన
మార్టూరు: గ్యాస్ లీక్ కావడంతో ఓ పూరిల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన మండలంలోని జొన్నతాళి గ్రామంలో సోమవారం ఉదయం జరిగింది. బాధిత కుటుంబం వివరాల మేరకు.. స్థానిక యాదవవీధిలో రెండు పోర్షన్లు గల ఇంటిలో తండ్రీకొడుకులు రెండు కుటుంబా లుగా విడివిడిగా నివాసం ఉంటున్నారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో ఇంట్లో అందరూ పనుల నిమిత్తం బయటకు వెళ్లారు. ఈ సమయంలో కుమారుడు చిట్టిబోయిన శివయ్య గదిలో గ్యాస్ లీకై విద్యుత్ సరఫరా కావడంతో సిలిండర్ ఒక్కసారిగా పేలి ముక్కలయింది. పేలుడు ధాటికి తండ్రి చిట్టి బోయి న సింగరయ్య నివాసంలోని ఖాళీ సిలిండర్ 200 మీటర్ల దూరంలోని నివాసాల మధ్య పడింది. ఎవరికి ప్రమాదం జరగలేదు. సమాచారం అందుకున్న చిలకలూరిపేట ఫైర్ స్టేషన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
దాచిపెట్టిన నగదు.. బంగారం బూడిద !
శివయ్య భార్య శాంతికి చెందిన రూ.17 వేల నగదు కాలిపోగా ప్లాస్టిక్ బాక్సులో దాచి ఉంచిన సుమారు 40 గ్రాముల బంగారు ఆభరణాలు మంటలకు మాడి కనిపించకుండా పోయాయి. సుమారు ఎనిమిది గ్రాముల ఆభరణాల ముక్కలు మాత్రమే మిగిలాయి. శివయ్య తండ్రి సింగరయ్య నివాసంలో రూ.9 వేల నగదుతోపాటు రెండు పోర్షన్లలోని రూ. లక్షకు పైగా ఫర్నిచర్ పూర్తిగా దగ్ధం కాగా మొత్తంరూ.4 లక్షలు నష్టం వాటిల్లిందని వాపోయారు. స్థానిక రెవెన్యూ అధికారులు ఘటనా స్థలికి చేరుకొని ప్రమాదం అంచనాలు ఉన్నతాధికారులకు తెలియజేయనున్నట్లు తెలిపారు.


