సొసైటీల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం
ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జి.బాలాజి
భట్టిప్రోలు: రాష్ట్రంలో చేనేత సహకార సంఘాలు (సొసైటీలు) ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జి.బాలాజి విమర్శించారు. భట్టిప్రోలులోని ఏఐటీయూసీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించి వారు మెరుగైన జీవనాన్ని గడిపే విధంగా చర్యలు చేపడతామని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు కార్మికుల సంక్షేమాన్ని, పరిశ్రమ రక్షణను విస్మరించారని పేర్కొన్నారు. చేనేత సహకార సంఘాలకు వివిధ రాయితీల రూపంలో చెల్లించాల్సిన బకాయిలను చెల్లించకపోవడంతో సొసైటీలు కొనఊపిరితో కొనసాగుతూ కార్మికులకు ఉపాధి కల్పించలేని దుస్ధితికి చేరుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి, సొసైటీల రక్షణకు తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సమితి సభ్యులు కె.రామకోటేశ్వరరావు, కె.వీరమోహన్‌రావు, ఏఐటీయూసీ నాయకులు బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


