మదనపల్లె (కురబలకోట): సమాజ హితం, సామాజిక న్యాయం, సమానత్వ సాధన కోసం భవిష్యత్తు ఉద్యమాలకు విద్యార్థులు సన్నద్ధం కావాలని ఎంఎస్‌పీ రాష్ట్ర అధ్యక్షులు ఎస్. నరేంద్రబాబు మాదిగ పిలుపునిచ్చారు. అన్నమయ్య జిల్లా ఇన్‌చార్జి కె. సంజీవ మాదిగ అద్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ సాధన కోసం సాగించిన సుదీర్ఘ పోరాటంలో మాదిగ విద్యార్థులు కీలక పాత్ర పోషించార న్నారు. ప్రపంచంలో ఏ ఉద్యమం విజయవంతమైనా దాని వెనుక విద్యార్థి శక్తి ఉంటుందన్నారు. అసమానతలు లేని నూతన సమాజ నిర్మాణమే లక్ష్యంగా భవిష్యత్తు ఉద్యమాలు సాగాలన్నారు. ప్రతి విద్యా సంస్థ, హాస్టల్‌తో పాటు గ్రామాలు, మండలాల్లో ఎంఎస్‌ఎఫ్ నూతన కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. నవంబరు 20లోపు విద్యార్థులతో క్షేత్ర స్థాయిలో సమావేశాలు నిర్వహించి వారిలో సామాజిక చైతన్యం పెంపొందిస్తూ భవిష్యత్ ఉద్యమాలకు సిద్దం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్‌పీఎస్, ఎంఎస్‌పీ, ఎంఎస్‌ఎఫ్ జిల్లా, నియోజక వర్గ, మండల నాయకులు పాల్గొన్నారు.


