చిన్నారుల ప్రతిభ.. బైబిల్‌ వైభవం | - | Sakshi
Sakshi News home page

చిన్నారుల ప్రతిభ.. బైబిల్‌ వైభవం

Nov 16 2026 1:26 AM | Updated on Nov 16 2026 1:26 AM

చిన్నారుల ప్రతిభ.. బైబిల్‌ వైభవం

– అలరించిన సండే స్కూల్‌ ఎగ్జిబిషన్‌

కురబలకోట: బైబిల్‌లోని చారిత్రక, ఆధ్యాత్మిక ఘట్టాలు ఒకే వేదికపై కళ్లముందు సాక్షాత్కరించడంతో సందర్శకులు మంత్రముగ్ధులయ్యారు. బైబిల్‌ విశేషాలను భావితరాలకు పరిచయం చేయడంతో పాటు చిన్నారుల్లో సృజనాత్మకత, ఆధ్యాత్మిక అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో కురబలకోట మండలం అంగళ్లులోని సీయోను ప్రార్థన మందిర ప్రాంగణంలో ఆదివారం వినూత్నంగా బైబిల్‌ ఎగ్జిబిషన్‌ నిర్వహించారు. మదనపల్లె డివిజన్‌ స్థాయిలో జరిగిన ఈ ప్రదర్శనలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు, సృష్టి ఆరంభం నుంచి యేసు పునరుత్థానం వరకు జరిగిన ప్రధాన సంఘటనలను సండే స్కూల్‌ చిన్నారులు వివిధ నమూనాల (మోడల్స్‌) రూపంలో అద్భుతంగా తీర్చిదిద్దారు. సృష్టి ఆరంభం, ఆదాము–హవ్వ, ఏదేను తోట, నోవహు ఓడ, ఐగుప్తు నివాసం, ఎర్రసముద్రం, మోషే పది ఆజ్ఞలు, ప్రత్యక్ష గుడారం, యెరికో కోట, దావీదు–గొల్యాతు, యోనా–చేప, యేసు జననం, ఆయన చేసిన అద్భుతాలు, పునరుత్థానం, పరలోక ద్వారాలు తదితర నమూనాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన సందర్శకులకు ప్రతి ఘట్టం వెనుక ఉన్న ఆధ్యాత్మిక సందేశాన్ని చిన్నారులే స్వయంగా వివరించడం విశేషం. ఈ కార్యక్రమానికి మదనపల్లి సమీపంలోని ఆరోగ్యవరం జెహోవా రోఫికా ప్రార్థన మందిర దైవసేవకులు కె.జాన్‌ డేవిడ్‌ న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. ప్రతిభ కనబరిచిన చిన్నారులకు సీయోను ప్రార్థన మందిరం ఆధ్వర్యంలో బహుమతులు అందజేశారు.

చిన్నారుల సృజనకు చక్కని వేదిక

పుస్తకాల్లో చదివే బైబిల్‌ సంఘటనలను ఎగ్జిబిషన్‌ ద్వారా ప్రత్యక్షంగా చూసే అవకాశం కలిగింది. దీనివల్ల చిన్నారుల్లో బైబిల్‌పై లోతైన అవగాహన రావడమే కాకుండా ప్రేమ, దయ, క్షమ, సేవాభావం వంటి ఉన్నత విలువలు అలవడతాయి. సందర్శకులకు విషయాలను వివరించడం వల్ల పిల్లల్లో మాట్లాడే నైపుణ్యం, ఆత్మవిశ్వాసం పెంపొంది వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుంది.

– విక్టర్‌ వేదనాయకమ్‌, ప్రధాన పాస్టర్‌, సీయోను ప్రార్థన మందిరం, అంగళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement